ట్రాఫిక్‌ విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు

27 Sep, 2016 22:27 IST|Sakshi
రాంగ్‌రూట్‌లో వెళ్తున్న వాహన చోదకున్ని ఆపి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్న ఎస్పీ
ట్రాఫిక్‌ పాయింట్లను తనిఖీ చేసిన ఎస్పీ
 
కర్నూలు: ట్రాఫిక్‌ విభాగంలో పని చేసే పోలీసులు విధులలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎస్పీ ఆకె రవికృష్ణ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలపై పోలీసు దండయాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం కర్నూలు నగరంలో ట్రాఫిక్‌ పాయింట్లను తనిఖీ చేశారు. ఆర్‌ఎస్‌ఐలతో మ్యాన్‌ప్యాక్‌లో మాట్లాడి, అప్రమత్తం చేశారు. రాజ్‌విహార్‌ సెంటర్, ప్రభుత్వ ఆసుపత్రి, మౌర్యా ఇన్‌ జంక్షన్, జిల్లా పరిషత్‌ జంక్షన్‌ తదితర ట్రాఫిక్‌ పాయింట్లలో ఎస్పీ  సందర్శించి ట్రాఫిక్‌ పోలీసుల పనితీరును పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వాహన జామ్‌లు తలెత్తకుండా సాఫీగా ప్రయాణించేందుకు ట్రాఫిక్‌ విభాగం పోలీసులు చర్యలు తీసుకోవాలని విధుల్లో ఉన్న సిబ్బందికి సూచించారు. ట్రాఫిక్‌ పాయింట్లలో ఉన్న సెక్టార్‌ ఇంచార్జిలైన ఆర్‌ఎస్‌ఐలతో మ్యాన్‌ప్యాక్‌లో మాట్లాడి, ట్రాఫిక్‌ జామ్‌ గురించి అడిగి తెలుసుకొని పలు సూచనలు, ఆదేశాలు జారీ చేస్తూ మానిటరింగ్‌ చేశారు. ట్రాఫిక్‌ పాయింట్లలో నిలబడి ట్రాఫిక్‌ క్రమబద్దీకరణపై స్వయంగా వీడియో తీశారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి, రాంగ్‌రూట్‌లో వెళ్తున్న వ్యక్తికి రూ.100 జరిమానా విధించారు. ట్రాఫిక్‌ డీఎస్పీ రామచంద్ర, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ బాబుప్రసాద్, సీఐ దస్తగిరి, ట్రాఫిక్‌ ఆర్‌ఎస్‌ఐలు ప్రతాప్, శ్రీనివాసగౌడ్, సోమశేఖర్‌నాయక్, వెంకటేశ్వర్లు, ట్రాఫిక్‌ పాయింట్లలో విధులు నిర్వహించారు. ఆయా ప్రాంతాలను తనిఖీ చేసి, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి సూచనలు, సలహాలు ఇచ్చారు.  
 
 
>
మరిన్ని వార్తలు