భాషను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం

25 Jul, 2016 21:21 IST|Sakshi
మధురానగర్‌: మన భాషను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని భాషను నిర్లక్ష్యం చేస్తే సంస్కృతికి ప్రమాదమని  ఏఎన్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌. శంకర్‌ పేర్కొన్నారు. మాచవరం ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ కళాశాలలో సోమవారం తెలుగు, ఇంగ్లిషు, సంస్కృతం, హిందీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్‌ వల్లూరుపల్లి రవి అధ్యక్షతన భాషాబోధనలో సవాళ్ళు అనే అంశంపై జాతీయ సదస్సు జరిగింది. కార్యక్రమంలో డాక్టర్‌ ఎస్‌. శంకర్‌ పాల్గొని కీలకోపన్యాసం చేశారు.  భాషాబోధనలో ఉండే సవాళ్ళు, పరిష్కార మార్గాలను అందరికీ అర్థమయ్యేరీతిలో వివరించారు. తెలంగాణకు చెందిన డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ భాష అనే చెట్టు ఫలాలను భక్షించటం కాదు దాని తల్లివేరును పరిరక్షించాలని అన్నారు. హిందీ భాషా నిపుణులు డాక్టర్‌ డి. నాగేశ్వరరావు, డాక్టర్‌ పి. శ్రీనివాసరావు హిందీభాషలోని తమ అనుభవాలను వివరించారు. అనంతరం తెలుగు, ఇంగ్లిషు, హిందీ , సంస్కృతం విభాగాలు వేర్వేరుగా నిర్వహించిన సాంకేతిక సదస్సులు ఆలోచింపచేసే విధంగా సాగాయి. సదస్సులో రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆచార్యులు, అధ్యాపకులు పత్రాలను సమర్పించారు.
అలాగే విద్యార్థులు భార్గవ్, మనీషా, ఇందిరాదేవి  సమర్పించిన పత్రాలను పలువురు పెద్దలు ప్రశంసించారు.  సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో కృష్ణాజిల్లా రచయితల సంఘం కార్యదర్శి డాక్టర్‌ జీ వీ పూర్ణచంద్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  ఆయన భాషా చరిత్రలోని విశేషాలను వివరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ వి. శంకరరావు (చెన్నై), డాక్టర్‌ పి. శ్రీనివాసరావు , డాక్టర్‌ పలపర్తి శ్యామలానంద ప్రసాద్, డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు,  తదితరులు పాల్గొని మాట్లాడారు. 
 
 
మరిన్ని వార్తలు