'ఆడపిల్లలను బయట ప్రాంతాలకు పంపొద్దు'

19 Sep, 2016 20:55 IST|Sakshi
'ఆడపిల్లలను బయట ప్రాంతాలకు పంపొద్దు'

గోపవరం :  దళారుల మాటలను నమ్మి ఆడపిల్లలను బయట ప్రాంతాలకు పంపవద్దని కడప జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ జడ్జి ప్రసాద్‌ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని శ్రీనివాసపురంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు సంపాదనపై ఆశపడి ఆడపిల్లలను బయటి ప్రాంతాలకు పంపడం వలన అక్కడ వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారనేది ఎవరికి తెలియదన్నారు. అక్కడ ప్రాణానికి ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడే తల్లిదండ్రుల దృష్టికి వస్తుందన్నారు. నేషనల్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ ప్రకారం 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. దీనికి చట్టాలు కూడా వర్తిస్తాయి. కానీ అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను కూడా బయటికి పంపడం చట్టరీత్యా నేరమన్నారు. దళారుల మాటలను నమ్మి పిల్లలను వారికి అప్పచెబుతారని, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అమ్మకాలు పెడుతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

అలాగే అధికశాతం ఆసుపత్రుల్లో చట్టవ్యతిరేకంగా స్కానింగ్‌ సెంటర్లు కొనసాగుతున్నాయని, అలాంటి సెంటర్లను గుర్తించి జిల్లాకలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. ఆసుపత్రిలో స్కానింగ్‌ ఏర్పాటు చేసేటప్పుడు కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి అన్నారు. ఆడపిల్లలు బాగా చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయని, ప్రభుత్వాలు కూడా వారికి 33 శాతం రిజర్వేషన్‌ కేటాయించడం జరిగిందన్నారు. ప్రతిఒక్కరూ ఆడపిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో భారతరత్న మహిళా మండలి చైర్పర్సన్‌ సరస్వతిదేవి, ఎస్‌ఐ నరసింహారెడ్డి, ఇన్‌చార్జి ఎంపీడీఓ నాగార్జునుడు, అడ్వకేట్‌ రమణారెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాసులు, ఈఓపీఆర్‌డీ విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు