కన్నా.. భయపడకు..!

12 Dec, 2016 22:52 IST|Sakshi
శిశువును 108లో నందికొట్కూరుకు తీసుకెళ్తున్న దృశ్యం
- విద్యుత్‌ సౌకర్యానికి నోచుకోని మహిళా ఆసుపత్రి
- చీకటిలోనే మహిళ ప్రసవం
ఓ మహిళ కడుపుతో ఉన్నప్పుడు ప్రసవ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రికి రండి.. తల్లీబిడ్డా క్షేమమంటూ వైద్య సిబ్బంది ఇంటికొచ్చి చెప్పారు. నెల నెలా వచ్చి ఆరోగ్య సలహాలు చెప్పారు. బిడ్డ భద్రం అంటూ ఎన్నో సూచనలు ఇచ్చారు. గర్భిణుల విషయంలో ప్రభుత్వం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటుందా అని ఆశ్చర్యపోయింది. తీరా ఆసుపత్రికి వెళ్తేగానీ అధికారుల తీరు ఆమెకు అర్థం కాలేదు. గర్భంలో ఉన్న తన బిడ్డకు చీకటి ప్రపంచాన్ని పరిచయం చేయాల్సి వస్తుందని. ప్రసవ వేదనలోనే ‘కన్నా భయపడకు’ అంటూ  పేగు తట్టి బిడ్డకు గుండె ధైర్యాన్నిచ్చింది.   అందమైన లోకంలోకి అడుగుపెట్టిన శిశువుకు చీకటే స్వాగతం పలికింది.  
- జూపాడుబంగ్లా
 
పారుమంచాల మహిళా ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పేరుకే 24గంటల ఆసుపత్రి. సౌకర్యాలు అంతంత మాత్రమే. సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన సుహాసిని ప్రసవవేదనతో ఆసుపత్రికి చేరుకుంది. అయితే కాన్పుల వార్డులో విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో ఽస్టాఫ్‌నర్సు సుప్రజ టార్చిలైట్లు, సెల్‌ఫోన్ల వెలుతురులోనే మహిళకు ప్రసవం చేయాల్సి వచ్చింది. సుఖప్రసవంలో జన్మించిన మగ శిశువుకు శ్వాస ఆడకపోవటంతో వెంటనే 108లో నందికొట్కూరుకు తరలించారు. ఏటా ఆసుపత్రి అభివృద్ధికి రూ. లక్షల్లో నిధులు మంజూరవుతున్నా కనీసం విద్యుత్‌ సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం వైద్యుల నిర్లక్ష్యాన్ని నిదర్శనంగా నిలుస్తోంది.  
 
నా చేతుల్లో ఏమి లేదు: మహేశ్వర ప్రసాద్‌, వైద్యాధికారి
ఆసుపత్రిలోని కాన్పుల వార్డుకు విద్యుత్‌ సౌకర్యం లేక చాలా రోజులైంది. ఇన్వర్టర్‌ ఏర్పాటు చేసినా పని చేయడం లేదు. విద్యుత్‌ ఏర్పాటు విషయం నా చేతిలో లేదు.   
 
>
మరిన్ని వార్తలు