పల్లెల్లో డబుల్ కు ట్రబుల్

10 Mar, 2016 04:37 IST|Sakshi

ఒక్కో ఇంటిపై అదనంగా రూ.70 వేల భారం
అంచనా వ్యయం సవరించాలంటున్న కాంట్రాక్టర్లు
గ్రామీణ ప్రాంతాల్లో ‘రెండు పడకల’పై సందిగ్ధత
ప్రభుత్వ నిర్ణయం కోసం యంత్రాంగం ఎదురుచూపు
ఆ లోపు పట్టణాల్లో నిర్మాణాల ప్రారంభానికి సన్నాహాలు

మంజూరైన ఇళ్లు: 6,850
గ్రామీణ ప్రాంతాలకు: 3,610
పట్టణ ప్రాంతాలకు: 3,240
నిర్మించే స్థలాలు: 105

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘రెండు పడక గదుల ఇళ్ల’ నిర్మాణ అంచనా వ్యయం లెక్క తప్పింది. నిర్దేశిత యూనిట్ విలువకు అనుగుణంగా ఇళ్లను నిర్మించలేమని కాంట్రాక్టు సంస్థలు చేతులెత్తేశాయి. ఒక ఇంటి యూనిట్ విలువను సగటున రూ.70వేలు పెంచితే తప్ప.. డబుల్‌బె డ్‌రూం ఇళ్ల నిర్మాణంలో ముందడుగు వేయలేమని తేల్చిచెప్పాయి. యూనిట్ విలువను రాష్ర్టస్థాయిలో ఖరారు చేసినందున.. ప్రభుత్వ నిర్ణయం కోసం జిల్లా యంత్రాంగం ఎదురుచూస్తోంది. ప్రతిపాదిత వ్యయాన్ని సవరిస్తే తప్ప పునాదిరాయి పడే అవకాశం లేకపోవడంతో టె ండర్ల ప్రక్రియ చేపట్టేందుకు వెనుకడుగు వేస్తోంది. ఈ పరిస్థితి గ్రామాల్లో నిర్మించే ఇళ్ల విషయంలోనే ఎదురవుతుండడంతో దీనిపై విధానపర నిర్ణయం తీసుకునేలోపు పట్టణ ప్రాంతాల్లో (మున్సిపాలిటీ) ఇళ్ల నిర్మాణాలను చేపట్టడానికి యంత్రాంగం ప్రణాళికలు తయారు చేస్తోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి

 పట్టణాల్లో నో ప్రాబ్లమ్
గ్రామీణ ప్రాంతాల తో పోలిస్తే పట్టణాల్లో ప్రభుత్వం ఖ రారు చేసిన ధరకే ఇళ్లను నిర్మించేందుకు కాంట్రాక్టు సంస్థలు అంగీకరించాయి. జీ+1, అపై అంతస్తులతో జరిగే అపార్ట్‌మెంట్ల నిర్మాణంతో యూనిట్ విలువ కలిసివస్తుందని అంచనా వేసిన కాంట్రాక్టర్లు నిర్దేశిత ధరకే గృహ నిర్మాణాలను చేపట్టగలమనే నిర్ణయానికి వచ్చారు. దీంతో తాండూరు, వికారాబాద్, బడంగ్‌పేట, మేడ్చల్, పెద్ద అంబర్‌పేట నగర పంచాయతీలతోపాటు శివార్లలోని ఫీర్జాదిగూడ, చెంగిచర్ల, ఘట్‌కేసర్, ఫీర్జాదిగూడ, మీర్‌పేట, జిల్లెల్‌గూడ పంచాయతీల్లో జీ+1+2+3 భవనాల్లో ఫ్లాట్‌లను నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రభుత్వం ఏప్రిల్‌లో వీటికి పునాదిరాయి వేసే దిశగా ఆలోచన సాగిస్తోంది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: డబుల్‌బెడ్‌రూం పథకం కింద జిల్లాకు 6,850 గృహాలను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంట్లో గ్రామీణ ప్రాంతాల్లో 3,610, పట్టణ ప్రాంతాల్లో 3,240 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేలా ప్రతిపాదనలు రూపొందించింది. జిల్లావ్యాప్తంగా 105 చోట్ల ఈ మేరకు ఇళ్లను నిర్మించేందుకు స్థలాలను కూడా ఎంపిక చేసింది. కాగా, స్థలాల లభ్యతకు అనుగుణంగా ప్రస్తుతం పల్లెల్లో 3,290, పట్టణాల్లో 1,160 ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ తయారు చేసింది. యూనిట్ విలువను కూడా ఇదివరకే ఖరారు చేసిన ప్రభుత్వం.. ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేయాలని భావించింది. అయితే, నిర్దేశిత వ్యయానికి అనుగుణంగా ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపకపోవడంతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్ విలువ (ఒక ఇల్లు) రూ.5.04 లక్షలు. దీంట్లో కేంద్రం రూ.35వేలు, రాష్ట్రం రూ.4.69 లక్షలను సబ్సిడీ రూపంలో అందజేస్తోంది.

అదే పట్టణ ప్రాంతంలో యూనిట్ కాస్ట్ రూ.5.30లక్షలు. దీంట్లో కేంద్రం రూ.లక్ష, రాష్ట్రం రూ.4.30 లక్షలను రాయితీగా భరిస్తోంది. తొలిదశలో 78 గ్రామాల్లో సగటున 20 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించిన జిల్లా యంత్రాంగం.. లేఅవుట్లను కూడా కొలిక్కి తెచ్చింది. ఇక ఇళ్ల నిర్మాణ  పనులు మొదలు పెట్టాలనుకుంటున్న తరుణంలో కాంట్రాక్టర్లు ముఖం చాటేస్తుండడం అధికారులను కలవరపరుస్తోంది. ఎస్‌ఎస్‌ఆర్ (స్టాండర్డ్ షెడూల్స్ ఆఫ్ రేట్స్) రేట్లకు అనుగుణంగా ప్రభుత్వం యూనిట్ విలువను ప్రకటించినప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని కాంట్రాక్టు ఏజెన్సీలు అంటున్నాయి. ప్రభుత్వ నిర్దేశిత రేట్ల ప్రాతిపదికన పల్లె ప్రాంతంలో ఒక గృహాన్ని నిర్మించాలంటే రూ.5.98 లక్షల వ్యయం అవుతుందని లెక్క తేల్చాయి. చేవెళ్లలోని గ్రామాల్లో ఇళ్లను నిర్మించేందుకు ఈ మేరకు కోట్ చే యడంతో బిత్తెరపోయిన యంత్రాంగం దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయింది. ఒక్కో ఇంటికి అదనంగా రూ.70వేల భారం భరించాల్సి రావడం.. జిల్లా వ్యాప్తంగా ఈ భారం రూ.25.27 కోట్లు కావడంతో యంత్రాంగానికి ఎటూ పాలుపోవడంలేదు.

ఈ నేపథ్యంలో తడిసిమోపెడవుతున్న అంచనా వ్యయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేగానీ టెండర్లను పిలిచే అవకాశం కనిపించడంలేదు. రాష్ట్ర స్థాయిలో విధానపర నిర్ణయం తీసుకునేలోపు పట్టణ ప్రాంతాల్లో జీ+1 (గ్రౌండ్ + అంతస్తులు) గృహాసముదాయాల నిర్మాణాలను మొదలు పెట్టేదిశగా కార్యాచరణ ప్రణాళికలు తయారుచేస్తోంది. ఇదిలావుండగా, గృహ నిర్మాణ వ్యయంలో 13.5శాతాన్ని కాంట్రాక్టర్‌కు ప్రాఫిట్ బెన్‌ఫిట్ కింద ప్రభుత్వం చెల్లిస్తోంది. ‘లబ్ధిదారులకే  ఇళ్ల నిర్మాణ బాధ్యతలను బదలాయిస్తే.. అదనపు భారం నుంచి సర్కారుకు వెసులుబాటు దక్కుతుంది. డిజైన్‌కు అనుగుణంగా సొంత స్థలాల్లో నిర్మించుకునే వీలు కలిగిస్తే స్థలాల కొరతను కూడా అధిగమించవచ్చని’ గృహనిర్మాణరంగ నిపుణులు అంటున్నారు.

మరిన్ని వార్తలు