‘పథకం’.. పునాదికే పరిమితం

9 Aug, 2016 21:51 IST|Sakshi
‘పథకం’.. పునాదికే పరిమితం
  • రెండేళ్లయినా కదలని ‘డబుల్‌ బెడ్‌రూం’
  • వెనకడుగు వేస్తున్న కాంట్రాక్టర్లు
  • ఆరు వేలకు.. 422 ఇళ్లకే టెండర్లు
  • పునాదిరాయి పడింది 110 ఇళ్లకే..

  • ఇదిగో ఇల్లు.. అదిగో ఇల్లు.. ఇలా రెండేళ్లు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. ముందుకు కదలని పథకం.. గూడు లేని పేదలు కళ్లు కాయలు కాసేలా చూస్తున్నా.. మచ్చుకు ఒక్క ఇంటి నిర్మాణం పూర్తికాని పరిస్థితి.. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కట్టుబాటులో తమకేమీ గిట్టదని కాంట్రాక్టర్లు వెనకడుగు వేయడంతో ఏర్పడిన అనిశ్చితి.. జిల్లావ్యాప్తంగా ఆరువేల ఇళ్లకు.. ఇటీవల 422 ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయి.. ఇప్పటికీ 110 ఇళ్లకే పునాదులు పడగా.. వైరా, మధిర, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో టెండర్ల ఊసే లేని దుస్థితి.
    – సాక్షిప్రతినిధి, ఖమ్మం

    జిల్లాలోని పది నియోజకవర్గాల్లో.. ఒక్కో దానికి 400 చొప్పున ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేసింది. ఖమ్మంకు అదనంగా 1,600 ఇళ్లను కేటాయించింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 6వేల ఇళ్ల నిర్మాణం చేపట్టాలి. అయితే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తే తమకు కొంతైనా లాభం ఉండదని బడా కాంట్రాక్టర్లు టెండర్‌ వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రూ.6.20లక్షలు, పట్టణాల్లో రూ.6.05లక్షలకు యూనిట్‌ విలువను పెంచింది. అయినా గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణంపై ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితి వల్ల జిల్లా, నియోజకవర్గాలవారీగా కాకుండా గ్రామాలవారీగా టెండర్లు పిలవడంతో కొన్ని గ్రామాల్లోనే కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. ఖమ్మం, ఖమ్మం రూరల్, ఇల్లెందు, మణుగూరు, పెనుబల్లి, వాజేడు ఇలా కొన్ని మండలాల్లో కాంట్రాక్టర్లు ముందుకు రావడంతో.. ఇప్పటివరకు 422 ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయి. ఖమ్మం రూరల్‌ మండలం మద్దులపల్లిలో 22, ఇల్లెందు మండలంలో 20, లంకపల్లి 40, మణుగూరులో 28.. మొత్తం 110 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. టెండర్లు ఖరారైనప్పటికీ ఇళ్ల నిర్మాణ పనులను కాంట్రాక్టర్లు మొదలు పెట్టడం లేదు. వైరా, మధిర, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో టెండర్లు పిలిచినా స్పందన లేకుండాపోయింది.
    ఇళ్లు మంజూరు చేయిస్తామంటూ..
    ఇక నియోజకవర్గాల్లో అధికార పార్టీతోపాటు ఇతర పార్టీలకు చెందిన కొందరు చోటా మోటా నేతలు ఇళ్లు ఇప్పిస్తామంటూ ఇంకా హామీలిస్తున్నారు. ఇళ్లు లేని పేదల నుంచి దరఖాస్తులు తీసుకుని.. వారి వద్ద నుంచి కొంత సొమ్ము వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గానికి పరిమితంగా ఇళ్లు మంజూరు కావడంతో ప్రజలు కూడా నేతలు చెప్పే మాటలు నమ్మి.. ఎలాగైనా తమకు ఇళ్లు ఇప్పించాలని అప్పో.. సప్పో చేసి కొంతమేరకు ముట్టచెబుతున్నారు. ఇలా వందలాది మంది వద్ద దరఖాస్తులు తీసుకున్న నేతలు.. అందులో తమకు ఎవరు ఎక్కువ ముట్టచెబితే వారికే ఇళ్లు ఇప్పించేందుకు అనుంగు ముఖ్య నేతలతో పైరవీలు చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ఇక గ్రామసభల ద్వారానే లబ్ధిదారులను గుర్తిస్తామని చెబుతున్న అధికారులు.. అధికార పార్టీ నేతలు తీసుకుంటున్న దరఖాస్తులపై నోరుమెదపకపోవడం గమనార్హం.
    అర్హులు ఒకచోట.. స్థల సేకరణ మరోచోట..
    ఇళ్ల నిర్మాణ విషయంలో అర్హులు ఒక ప్రాంతంలో ఉంటే.. అధికారులు మాత్రం మరో ప్రాంతంలో స్థల సేకరణ చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో పట్టణాలకు సమీపంలో కాకుండా.. దూరంగా ఉన్న ప్రాంతంలో అధికారులు భూ సేకరణ పై దష్టి పెట్టడంతో పలు విమర్శలొస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమైనా వీటి గురించి మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. వాటిని కబ్జా చెర నుంచి విడిపిస్తే కనీసం నియోజకవర్గ కేంద్రంలో ఎంపికయ్యే లబ్ధిదారులకైనా ఇళ్లు నిర్మించే అవకాశం ఉంటుంది. ఇందిరమ్మ పథకం కింద నగరానికి దూరంగా ఇళ్లు నిర్మించినా.. ఈ కాలనీల్లో ఇప్పటికీ రోడ్లు, డ్రెయినేజీ, మంచినీటి  సరఫరా లేదు. ఇళ్లు నిర్మించినా లబ్ధిదారులు మాత్రం వాటిలో అడుగు పెట్టలేదు. డబుల్‌ బెడ్‌రూం పథకం కింద నిర్మించే ఇళ్లకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దని లబ్ధిదారులు కోరుతున్నారు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఫలితం లేకపోవడంతో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు మాత్రం తమకు ఇళ్ల నిర్మాణం ఎప్పుడు జరుగుతుందా? అని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు.
     

మరిన్ని వార్తలు