రెండింతల వాన

23 Sep, 2016 21:49 IST|Sakshi
రెండింతల వాన
సెప్టెంబర్‌లో ఇప్పటికే సాధారణ వర్షపాతంకంటే రెట్టింపు వర్షం
పిడుగురాళ్లలో 20.42 సెం.మీ నమోదు
ఆందోళనలో రైతులు
 
కొరిటెపాడు (గుంటూరు): జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. దాదాపు అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం కంటే రెండింతలు నమోదైంది. వారం క్రితం కురిసిన వర్షాల నుంచి తేరుకునేలోపే తిరిగి భారీ వర్షాలు కురవడంతో పంట పొలాలు నీళ్లమయమయ్యాయి. పొలాల్లో కురిసిన వర్షపు నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేకుండా పోయింది. శుక్రవారం ఉదయం పిడుగురాళ్ల మండలంలో అత్యధికంగా 20.42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా తెనాలి మండలంలో 0.10 సెంటీమీటర్లు కురిసింది.
 
జిల్లాలో 38,797 హెక్టార్లలో పంటలు మునక...
భారీ వర్షాలకు జిల్లాలో 36,497 హెక్టార్లలో పంటలు నీట మునిగిపోయాయి. వరి 8,714 హెక్టార్లు, పత్తి 22,788 హెక్టార్లు, కంది 4,204 హెక్టార్లు, మిరప 2,300 హెక్టార్లు, మినుము 477 హెక్టార్లు, పెసర 158 హెక్టార్లు, జూట్‌ 80 హెక్టార్లు, సోయాబిన్‌ 46 హెక్టార్లు, మొక్కజొన్న 30 హెక్టార్లు ప్రస్తుతం నీటిలో ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో రెండు రోజులపాటు వర్షాలున్నాయని వాతావరణ శాఖ చెప్పడంతో అధికారులను కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే అప్రమత్తం చేశారు. 
 
పిడుగురాళ్లలో 20.42 సెం.మీ వర్షం...
జిల్లాలో సగటున 2.87 సెం.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి... రెంటచింతల మండలంలో 16.02 సెం.మీ, గురజాల 13.02, నకరికల్లు 11.24, దాచేపల్లి 11.04, మాచర్ల 10.74, వెల్దుర్తి 7.92, సత్తెనపల్లి 7.82, దుర్గి 6.12, పెదకూరపాడు 6.04, ముప్పాళ్ల 5.78, బెల్లంకొండ 4.60, మాచవరం 4.02, ఫిరంగిపురం 4.02, నరసరావుపేట 3.46, బొల్లాపల్లి 3.16, మేడికొండూరు 3.02, కారంపూడి 2.66, ఈపూరు 2.52, రొంపిచర్ల 2.40, నాదెండ్ల 1.86, యడ్లపాడు 1.56, కాకుమాను 1.50, శావల్యాపురం 1.28, పెదనందిపాడు 1.12, పొన్నూరు 0.86, వినుకొండ 0.86, రాజుపాలెం 0.80, ప్రత్తిపాడు 0.74, తాడికొండ 0.74, క్రోసూరు 0.68, కొల్లూరు 0.62, తుళ్లూరు 0.62, చిలకలూరిపేట మండలంలో 0.58 సెం.మీ చొప్పున వర్షం పడింది.
మరిన్ని వార్తలు