నీళ్లొచ్చేనా?

22 Jul, 2016 00:12 IST|Sakshi
అచ్చంపేట మండలం బక్కలింగాయిపల్లి వద్ద నిర్మిస్తున్న పుష్కరఘాట్‌
  •  ఘాట్‌ నిర్మాణం కోసం రూ.1.37కోట్ల నిధులు 
  •  నాగార్జునసాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉంటేనే ఉపయోగం 
  •  నాసిరకంగా జరుగుతున్న పనులు 
  •  పట్టించుకోని నీటి పారుదలశాఖ అధికారులు
  • అచ్చంపేట: బక్కలింగాయిపల్లి...ఓ ఏజన్సీ గ్రామం. జిల్లాకు దూరంగా విసిరేసినట్లు ఉంటుంది. మండలకేంద్రం అచ్చంపేటకు 60కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభుత్వం పుష్కరఘాట్‌ నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించింది. 20/140మీటర్ల విస్తీర్ణంలో నిర్మిస్తున్న పుష్కరఘాట్‌ కోసం రూ.1.37కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇది వరకు బాగానే ఉంది.. కానీ ఇక్కడ పుష్కరాలు సమయానికి ఈ ఘాట్‌ భక్తులకు ఉపయోగపడేది అనుమానంగానే ఉంది. జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండి నాగార్జునసాగర్‌కు నీళ్లు వెళ్లి, ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఉంటేనే ఈ పుష్కరఘాట్‌కు నీళ్లు వస్తాయి. సాగర్‌కు నీళ్లు రాకపోతే ఈఘాట్‌ ఎందుకు ఉపయోగపడే అవకాశం లేదు. ప్రస్తుతం ఈ ఘాట్‌ నుంచి  ఏడు కిలోమీటర్ల దూరంలో సాగర్‌ బ్యాక్‌వాటర్‌ ఉంది. పుష్కరాలకు మరో 22రోజులు మాత్రమే ఉన్నాయి. ఈలోగా కర్ణాటకలో భారీ వర్షాలు పడి, కృష్ణమ్మ కనికరిస్తేనే గానీ ఈ ఘాట్‌కు నీళ్లొచ్చే అవకాశం లేదు. అధికారులు ముందు చూపులేకుండా బక్కలింగాయిపల్లి వద్ద పుష్కరఘాట్‌ నిర్మిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

     

    నాణ్యతకు తిలోదకాలు
    బక్కలింగాయిపల్లి వద్ద చేపడుతున్న పుష్కరఘాట్‌ నాసిరకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 80శాతం పనులు పూర్తయ్యాయి. మరో వారం రోజుల పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కంకర, ఇసుక బాగానే ఉన్నా సిమెంటు నిబంధనల ప్రకారం వాడటం లేదన్న ఆరోపణలున్నాయి. నాణ్యతగా పనులు లేకపోవడంతో వేసిన కంకర బెడ్లు, వాల్స్‌ ఇప్పుడే రాలిపోతున్నాయి. నిబంధనల ప్రకారం వైబ్రేషన్‌ మిషన్‌ వాడాల్సిన ఉన్నా, దాన్ని ఉపయోగించడం లేదు. క్యూరింగ్‌ కూడా నామమాత్రంగా చేస్తున్నారు. నిర్మించిన ప్లాట్‌ఫాంలు లేవల్‌గా లేకపోవడంతో అక్కడక్కడ గోతులు ఏర్పడి నీళ్లు నిలుస్తున్నాయి. పుష్కరఘాట్‌ వద్ద మూడు బోర్లు వేశారు. మోటార్లు బిగించి పైపులైన్‌ ఏర్పాటు చేసి మూడు మినీ ట్యాంకుల ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ఘాట్‌ వద్ద మరుగుదొడ్లతో 20 డ్రస్సింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇంత వరకు మొదలు పెట్టలేదు. పనులు వద్ద కాంట్రాక్టర్‌ కానీ, సూపర్‌వైజర్లు ఎవరూ లేకపోవడంతో పనివాళ్లు మాత్రమే అక్కడ పనులు చూసుకుంటున్నారు. నీటిపారుదలశాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఘాట్‌ వద్ద మట్టి లేవలింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. వాల్స్‌ నిర్మాణం జరుగుతోందని, డ్రసింగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాల్సి ఉందని, కోర్‌ టెస్టు చేసి ల్యాబ్‌కు పంపించి క్వాలిటీ వస్తేనే బిల్లులు ఇస్తామని ఇరిగేషన్‌ డీఈ అశోక్‌కుమార్‌ తెలిపారు. విద్యుత్‌శాఖ అధికారులు స్తంభాలే వేసి, లైన్‌ ఏర్పాటు చేశారు. అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ బిగించే పనిలో ఉన్నారు. మద్దిమడుగుకు 8కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణానది వద్ద కూడా పుష్కరఘాట్‌ ఏర్పాటు చేయాలని నల్లమల ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇక్కడి రోడ్డుతో పాటు ఘాట్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు. తొలుత జిల్లాలో అన్ని పుష్కరఘాట్లతో పాటు మద్దిమడుగు వద్ద ఘాట్‌ కోసం ప్రతిపాదనలు పంపిన అధికారులు, ఆ తర్వాత దీన్ని పక్కకు పెట్టారు.   

మరిన్ని వార్తలు