అయ్యో.. రొయ్య

6 Jul, 2017 01:59 IST|Sakshi
అయ్యో.. రొయ్య

బుచ్చిరెడ్డిపాళెం : జిల్లాలో వెనామీ రొయ్య ఎదురీదుతోంది. కష్టాల కోర్చి పెంచిన రైతులకు నష్టాలు మిగులుస్తోంది. సాధారణంగా రొయ్య సైజు ఎంత పెరిగితే అంత ఎక్కువ ధర లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌ పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. రొయ్యల కొనుగోలుదారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. నెల రోజుల వ్యవధిలో కిలోకు రూ.100 నుంచి రూ.120 వరకు ధర తగ్గింది. దీంతో రైతులు టన్నుకు రూ.లక్ష వరకు నష్టపోతున్నారు. ప్రధానంగా 30, 40, 50, 60 కౌంట్‌ రొయ్యలపై ధరల ప్రభావం తీవ్రంగా ఉంది. జిల్లాలో దాదాపు 15 వేల ఎకరాల్లో రొయ్యలు పెంచుతున్నారు.

వీటిలో 95 శాతం వెనామీ రకమే. రోజుకు 200 టన్నుల రొయ్యల జిల్లా నుంచి ఎగుమతి అవుతున్నాయి. నెల రోజుల్లో 6 వేల టన్నులను ఎగుమతి చేయగా.. టన్నుకు  రూ.లక్ష చొప్పున ధర తగ్గడంతో రూ.60 కోట్లను జిల్లా రైతులు  నష్టపోయారు. ధర పడిపోవడంతో జిల్లాలో సుమారు 3 వేల ఎకరాల్లో 30, 40 కౌంట్‌కు వచ్చిన రొయ్యలను పట్టుబడి పట్టకుండా చెరువుల్లోనే ఉంచేశారు. తక్కువ ధరకు అమ్ముకోలేక.. చెరువుల్లోనే ఉంచి మేపలేక ఆక్వా రైతులు సతమతమవుతున్నారు. కొందరైతే చచ్చినోడి పెళ్లికి.. వచ్చిందే కట్నం అన్నట్టుగా అయినకాడికి అమ్ముకుంటూ నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు.

దళారుల మాయాజాలమేనా!
రొయ్యలను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసేవారి సంఖ్య జిల్లాలో చాలా తక్కువ. దీంతో దళారులు రైతుల వద్దకు వెళ్లి పట్టుబడికి వచ్చిన రొయ్యలను కొనుగోలు చేస్తున్నారు. వీరంతా సిండికేట్‌గా ఏర్పడి 15 రోజులకు ఒకసారి సమావేశమవుతూ ధరలను నిర్ణయిస్తున్నారు. మార్కెట్‌లో ధర బాగున్నప్పటికీ దళారులు మాత్రం తగ్గించేశారని రైతులు వాపోతున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే కేజీకి రూ.100 నుంచి రూ.120 వరకు ధర తగ్గించారని చెబుతున్నారు. 30 కౌంట్‌ రొయ్యల కేజీ ధర నెల రోజుల క్రితం రూ.550 ఉండగా.. ప్రస్తుతం రూ.440కి పడిపోయింది. 40 కౌంట్‌ ధర రూ.440 నుంచి రూ.340కి, 50 కౌంట్‌ ధర రూ.360 నుంచి రూ.260కి, 60 కౌంట్‌ ధర రూ.350 నుంచి రూ.230కి తగ్గించేశారు.

వ్యాపారులు చెబుతున్న కారణాలివీ
రొయ్యల్ని ఎగుమతి చేసే వ్యాపారులు ఇన్ని టన్నుల వరకు సరుకు సరఫరా చేస్తామని దిగుమతిదారులతో ముందుగానే ఒప్పందాలు చేసుకుంటారు. ఒప్పందం ప్రకారం లక్ష్యం పూర్తయిన అనంతరం కూడా ఎగుమతులు చేస్తే కొనుగోలు ధరల్లో వ్యత్యాసం ఉంటుందని చెబుతున్నారు. లక్ష్యాల మేరకు ఎగుమతులు పూర్తికావడంతో బయ్యర్లు కొనుగోలు చేయడం లేదని.. ఆ కారణంగానే ధరలను తగ్గించాల్సి వచ్చిందంటున్నారు. అయితే, ఇది అసలు కారణం కాదని రైతులు కొట్టిపారేస్తున్నారు. లక్ష్యం మేరకు కొనుగోళ్లు పూర్తయ్యాయనేది వట్టిమాటేనంటున్నారు. వ్యాపారులంతా బృందంగా ఏర్పడి ధరలు తగ్గించేసి తమను నిలువునా ముంచేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

మరిన్ని వార్తలు