అత్తింటి వేధింపులకు బలి

4 Aug, 2016 23:22 IST|Sakshi
అత్తింటి వేధింపులకు బలి
  • భర్త, అత్తమామలే హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ
  • కొడకండ్ల :  అదనపు వరకట్న వేధింపులకు వివాహిత బలైన ఘటన మండలంలోని రేగుల గ్రామంలో గురువారం చోటుచేసుకొంది. తమ కుమార్తెను అత్తింటి వారు హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. నెక్కొండ మండలం రెడ్లవాడకు చెందిన పల్లెకొండ నర్సయ్య–నర్సమ్మల కుమార్తె లావణ్య(19)ను రేగుల గ్రామానికి చెందిన రాయారపు యాకయ్య–సాయమ్మల కుమారుడు అశోక్‌కు ఇచ్చి 8నెలల క్రితం రూ.3లక్షల కట్నకానుకలు ఇచ్చి వివాహం చేశారు. ఆ తర్వాత నెలరోజులకే భర్త, అత్త, మామలు అదనపు కట్నం కోసం వేధించసాగారు. దీంతో లావణ్య తల్లిదండ్రులు, బంధువులు వచ్చి వారిని నిలదీయగా ఇక నుంచి మంచిగా చూసుకొంటామని అన్నారు. కానీ వారి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో నెల రోజుల క్రితం లావణ్య తల్లిదండ్రులు అప్పు చేసి రూ.80 వేలు ఇచ్చారు. అయినా వేధింపులు ఆపలేదని, వారు తీవ్రంగా కొట్టడం వల్లే తమ కూతురు మృతి చెందిందని, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని నర్సయ్య, నర్సమ్మ విలపించారు. లావణ్య మృతి విషయం తెలిసి తాము వచ్చేసరికే ఆ ముగ్గురూ పరారయ్యారని చెప్పారు. తమ కుమార్తెను గొంతు నులిపి, కొట్టారని, చాతిపై, వీపులో గాయాలు ఉన్నాయని తెలిపారు. లావణ్య భర్త, అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. వారి ఫిర్యాదు మేరకు అశోక్, యాకయ్య, సాయమ్మపై కేసు నమోదు చేసినట్లు పాలకుర్తి సీఐ కరుణాసాగర్‌రెడ్డి, ఎస్సై ఎంబాడి సత్యనారాయణలు తెలిపారు.  
మరిన్ని వార్తలు