ఆశల వల

15 Oct, 2016 17:10 IST|Sakshi
ఆశల వల
భార్య :ఏమయ్యా.. చంటోడు గుక్క పట్టిండు.. పాల డబ్బా  తెస్తనన్నవుగా ఏదయ్యా..’ 
 
భర్త : ‘ఊకోవే.. డబ్బులెక్కడున్నయ్‌.. ఆడికి నువ్వే కాసిని పాలు పట్టు.. కొద్ది రోజుల్లో మనం లచ్చాధికారులం కాబోతున్నం.. ఒక్క లాటరీ తగిలితే చాలే.. ఇక మన కష్టాలన్నీ తుర్రున ఎగిరిపోతయ్‌..’
 
భార్య : ‘ఏడాది నుంచి ఇదే చెబుతున్నవు గదయ్యా.. ఆ మాయదారి లాటరీ ఏమో చేసిన కష్టమంతా దానికే దారపోస్తన్నవ్‌.. పొయ్యిలో కట్టెలు లేవు.. పొయ్యిపై గింజలు లేవు.. నాలుగు మెతుకులు లేక పేగులు మెలిపెడుతున్నాయయ్యా.. ఈ చంటోడ్ని తీసుకో.. పక్కింటికన్నాపోయి నాలుగు గింజలు అడుక్కొస్తా..’
 
ఇదీ నరసరావుపేట కేంద్రంగా జిల్లాలో సాగుతున్న
లాటరీకి గుల్లవుతున్న ఓ కుటుంబం దీనావస్థ
 
నరసరావుపేట టౌన్‌: సింగిల్‌ నంబర్‌ లాటరీ పేద, మధ్య తరగతి కుటుంబాలను సర్వనాశనం చేస్తోంది. నరసరావుపేట కేంద్రంగా చేసుకొని జిల్లా వ్యాప్తంగా నిషేధిత లాటరీ మూడు పువ్వులు, ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతోంది. కొందరు దురాశాపరులు లాటరీ అక్రమ వ్యాపారాన్ని ఎంచుకొని పేదల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. పట్టణంలో హోల్‌సేల్‌ వ్యాపారులు 20 మంది ఉండగా వారి వద్ద నుంచి లాటరీ నంబర్లను కొనుగోలు చేసి ఇతరులకు విక్రయించే రిటైల్‌ వ్యాపారులు 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం సింగిల్‌ నంబర్‌ లాటరీని ఎప్పుడో నిషేధించినప్పటికీ అక్రమ వ్యాపారులు అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి యథేచ్ఛగా దందాను కొనసాగిస్తున్నారు. పల్నాడు బస్టాండ్, రైల్వేస్టేçÙన్, శివుని బొమ్మ, మార్కెట్‌ సెంటర్, గుంటూరు రోడ్డు, పనస తోట మీ–సేవ ప్రాంతాల్లో వ్యాపారులు కార్యాలయాలను ప్రారంభించి లాటరీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారంటే వారికి పోలీసుల అండదండలు ఏ మేరకు ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది. గత బుధవారం గురజాలలో ఒకే నంబర్‌ టికెట్‌ ఇద్దరికి విక్రయించడం వివాదాస్పదమైంది. దీనిపై విచారణలో వ్యాపారి నరసరావుపేటలో బడా వ్యాపారి వద్ద టికెట్లు కొనుగోలు చేసి కొంతకాలంగా వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. ఇలా నరసరావుపేట పట్టణంలోని హోల్‌సేల్‌ వ్యాపారుల వద్ద నుంచి వినుకొండ, చిలకలూరిపేట, గుంటూరు, పిడుగురాళ్ల, మాచర్ల, సత్తెనపల్లి, నకరికల్లు తదితర ప్రాంతాల రిటైల్‌ వ్యాపారులు టికెట్లు కొని వారి సొంత పట్టణాల్లో విక్రయిస్తున్నారు. ఈ వ్యాపారం ప్రతిరోజూ లక్షల్లో సాగుతుంది.
 
అంతా కాగితపు ముక్కలపైనే...
పట్టణంలోని హోల్‌సేల్‌ వ్యాపారులు చెన్నైలోని బడా వ్యాపారులకు ముందస్తుగా అడ్వాన్సులు చెల్లిస్తున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి వారం ముందుగా విడుదలయ్యే లాటరీ నంబర్లను ఆన్‌లైన్‌ ద్వారా సేకరించి విక్రయిస్తారు. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వారు కోరుకున్న నంబరును వ్యాపారులు స్లిప్‌లపై రాసి ఇస్తారు. రూ.20 నుంచి మొదలై రూ.500 వరకు లాటరీ టికెట్ల ధరలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కార్మికుడు అత్యాశకు పోయి 4, 5 టికెట్లను కొనుగోలు చేస్తున్నాడు. లాటరీ తగలకపోవడంతో తిరిగి మళ్లీ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ అప్పుల పాలవుతున్నాడు.
 
లాటరీలకు విచిత్రమైన పేర్లు...
మార్కెట్‌లో విక్రయించే నిషేధిత లాటరీలకు విచిత్రమైన పేర్లు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారులు కోడ్‌ భాషతో పిలుస్తున్నారు. నల్ల నేరం, కూయల్, రోశ, సంఘం, కుమరన్, విష్ణు తదితర టిక్కెట్లు విక్రయిస్తున్నారు. ఒకవేళ లాటరీ తగిలితే రెండోరోజు వ్యాపారి తమ కమీషన్‌ను తీసుకొని మిగిలిన నగదు ఇస్తారు. నగదు లావాదేవీలు అంతా బ్యాంక్‌ ద్వారా జరుగుతున్నట్టు సమాచారం. విజేత నగదు ఎవరు ఇస్తారనేది వ్యాపారికి తప్ప ఎవరికీ తెలీదు. 
మరిన్ని వార్తలు