ఎండుతున్న ఆశలు!

29 Jan, 2017 00:19 IST|Sakshi
ఎండుతున్న ఆశలు!
-కేసీ కెనాల్‌కు నీటి సరఫరా నిలిపి వేత
– వాడిపోతున్న చివరి ఆయకట్టు పంటలు మిరప, పత్తి
– ఒకతడి నీరు ఇస్తే పంట కాపాడుకుంటామని రైతుల మొర
– స్పందించని కేసీ అధికారులు, ప్రజాప్రతినిధులు
 
 చేతికొచ్చిన చివరి ఆయకట్టు పంటలు నీరు లేక వాడిపోతున్నాయి. కెనాల్‌కు నీరు వదులుతారనే ఆశతో రైతులు ఖరీఫ్‌లో పత్తి, మిరప, వరి పంటలు సాగు చేశారు. ​తెగుళ్లు సోకకుండా ఎరువులు, మందులు వేసుకుంటూ కంటికి రెప్పలా పంటలను  కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒకతడి నీరందిస్తే పంట చేతికొస్తుంది. ఉన​‍్నట్టుండి  ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి  కేసీకి నీటి విడుదలను నిలిపివేసి వారి ఆశలపై నీళ్లు చల్లారు అధికారులు.  నీరులేక  ఎండిపోతున్న పంటలను ఎలా కాపాడుకోవాలి తెలియక రైతన్నలు దిగాలు చెందుతున్నారు.
 
 
ప్రారంభించి పదిరోజులు గడకమునుపే ట్రైల్‌రన్‌ మాత్రమే అంటూ అధికారులు ఎత్తిపోతల పథకం నుండి కేసీకి నీటి సరఫరా నిలుపుదల చేశారు. దీంతో కేసీ కెనాల్‌కు శాశ్వత నీటి హక్కు లేక వేసుకున్న ఆయకట్టు పంటలు ఎండు దశకు చేరుకున్నాయి. ఖరీఫ్‌లో సకాలంలో వర్షాలు, కాల్వలకు నీరు లేక అవస్థలు పడ్డ రైతులు రబీ సీజన్‌లో నదుల్లో నీరు ఉందన్న ధైర్యంతో పంటలు సాగు చేశారు. 
 
 
నంద్యాలరూరల్‌: నంద్యాల మండలంలో  కేసీ కెనాల్‌ కింద మూలసాగరం, కానాల, చాపిరేవుల, బ్రాహ్మణపల్లె, పుసులూరు, పాండురంగాపురం, మిట్నాల, గుంతనాల, గోస్పాడు మండలంలోని పసురపాడు, గోస్పాడు, జూలేపల్లె, తేళ్లపురి తదితర గ్రామాల్లోని చివరి ఆయకట్టు రైతులు  వరి, పత్తి, మిరపను అధిక విస్తీర్ణంలో సాగు చేశారు. వరి చేతికి వచ్చింది. ఇక పత్తి, మిరపకు  ఒక తడి నీరు అవసరం.  
 
ఆశలపై నీళ్లు!
పత్తి, మిరపను ఆయా గ్రామాల్లో 3500 ఎకరాల్లో సాగు చేశారు. రైతులు ఎకరా మిరప సాగుకు లక్షరూపాయలు పెట్టుబడి పెట్టారు. పత్తికి రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు పెట్టుబడి  పెట్టారు.  పంట చేతికొచ్చే సమయంలో కేసీకి నీటి సరఫరా నిలిపివేయడంతో వారికి దిక్కుతోచడం లేదు. ఇప్పటికే మిరప పంట ఎండిపోతుంది. పత్తి  కాయలు పగిలిపోతున్నాయి. కేసీకి  సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని రైతన్నలు   అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసి విన్నవించుకుంటున్నారు. అయినా, వారు చలించని పరిస్థితి.
 
ఆదుకోని ముచ్చుమర్రి
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ద్వారా కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేసి రాయలసీమలో ఎండుతున్న పంటలను కాపాడుతామని  ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పథకం ప్రారంభోత్సవ సమయంలో ప్రకటించారు.  అయితే, పట్టుమని పదిరోజులు కూడా కెనాల్‌కు నీరు వదలక ముందే నిలిపివేశారు.  ఇదేమిటని అడిగితే  ముచ్చుమర్రి పథకం ట్రయల్‌రన్‌ కోసమే కెనాల్‌కు పదిరోజులు నీరు వదిలామని అధికారులు సమాధానం చెబుతున్నారు.  ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు కుందూనది, వాగులు, వంకల్లో ఆయిల్‌ ఇంజిన్లు పెట్టి కి.మీ మేర అద్దె పైపులతో నీటిని తోడుతున్నారు.  
 
 
పంటలు ఎండుతున్నాయి–అబ్దుల్‌సుకూర్, మిట్నాల:
కౌలుకు తీసుకుని 10 ఎకరాల్లో 5 ఎకరాల్లో మిరప, 5 ఎకరాలో పత్తి పంట  సాగు చేశా. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టా. పంట చేతికొచ్చే సమయంలో కాల్వలకు నీరు బంద్‌ చేశారు. ఒక తడి నీరు వస్తే దిగుబడి పెరిగి నష్టాల నుంచి బయట పడతాం. పంటలు వేసుకోండి  అన్న ఎంపీ, ఎమ్మెల్యేలు ఇప్పుడు పట్టించుకోవడం లేదు.  ఎలాగైనా కేసీకి నీరు విడుదల చేయించి ఎండుతున్న పంటలు కాపాడాలి. లేకుంటే తీవ్రంగా నష్టపోతాం. 
 
ట్రయల్‌ రన్‌ కోసం కేసీకి నీరు విడుదల చేశాం–మల్లికార్జునరావు, కేసీ ఈఈ:
 ఆలస్యంగా ఖరీఫ్‌ ప్రారంభం కావడంతో జనవరి 25వరకు కేసీకి నీరు విడుదల జరిగింది. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి కేసీకి కెనాల్‌కు నీరు విడుదల ట్రయల్‌రన్‌లో భాగమే.  ప్రస్తుతం ముచ్చుమర్రి నుంచి నీరు రాదు.  ఎండుతున్న పంటల విషయాన్ని ఉన్నతాధికారుల ద​ృష్టికి తీసుకెళ్లాం. 
 
మరిన్ని వార్తలు