తాగుబోతు వీరంగం

25 Oct, 2016 22:22 IST|Sakshi
తాగుబోతు వీరంగం

హాస్టల్‌ విద్యార్థిపై దాడి
కొరవడిన అధికారుల పర్యవేక్షణ
అభద్రతాభావంతో విద్యార్థులు


బత్తలపల్లి : సంక్షేమ వసతిగహం విద్యార్థులపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. సాయంత్రం నుంచి ఉదయం వరకు వార్డెన్, సిబ్బంది, నైట్‌వాచ్‌మన్‌ లేకపోవడంతో అభద్రతాభావంతో బిక్కుబిక్కుమంటున్నారు. తాజాగా ఓ తాగుబోతు హాస్టల్‌లో వీరంగం వేశాడు. పసివాడని కూడా చూడకుండా విద్యార్థిపై విచక్షణారహితంగా దాడిచేసి గాయపరిచాడు.

మండలంలోని రాఘవంపల్లికి చెందిన నాగరాజు, ఆదెమ్మల ఏకైక కుమారుడు ఎల్‌.వాసు బత్తలపల్లిలోని బీసీ సంక్షేమ వసతిగహంలో ఉంటూ బాలుర ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థికి కొంచెం మానసిక స్థితి కూడా సరిగా లేదు. సోమవారం రాత్రి హాస్టల్‌లో వాసు, అతని స్నేహితుడు గొడవపడ్డారు. స్నేహితుడు సమీపంలోని తాగుబోతు బేల్దారి రాజుకు గొడవ గురించి చెప్పాడు. మద్యం మత్తులో ఉన్న ఆ బేల్దారి హాస్టల్‌లోకి వెళ్లి వాసుపై దాడి చేశాడు. ఛాతీపై బలంగా తన్నడంతో బాలుడు గోడకు తగిలి గాయపడ్డాడు. అంతటితో ఆగకుండా బెత్తం తీసుకుని ఇష్టమొచ్చినట్టు బాదడంతో వీపుపై వాతలు పడ్డాయి.

ఈ సమయంలో వార్డెన్‌ గానీ, అటెండర్లు గానీ ఎవ్వరూ లేరు. రక్తపుగాయలతో ఏడుస్తున్న వాసును తోటి స్నేహితులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్థానికులు గమనించి విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన బత్తలపల్లికి చేరుకున్నారు. వార్డెన్‌కు ఫోన్‌ చేస్తే సరైన స్పందన రాలేదు. దీంతో వారు అర్ధరాత్రి 12 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం తెలిపారు. మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హాస్టల్‌కు చేరుకునే సరికి ముగ్గురు అటెండర్లు విధులకు హాజరయ్యారు. తమ డ్యూటీ ప్రకారం వచ్చి పోతుంటామని అటెండర్లు తెలిపారు. రాత్రిపూట ఎవ్వరూ ఉండం అని చెప్పారు. వార్డన్‌ అనంతపురంలో కాపురం ఉండడంతో ఆయన కూడా సాయంత్రమే వెళ్లిపోతారన్నారు. తమకు భద్రత కరువైందని ఈ సందర్భంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

రాత్రి సమయంలో పర్యవేక్షిస్తాం
తాగుబోతు వీరంగం చేసిన సమయంలో నేను విజయవాడలో ఉన్నాను.  హాస్టల్‌కు నైట్‌ వాచ్‌మెన్‌లను ప్రభుత్వం తీసుకోలేదు. విద్యార్థిపై జరిగిన దాడి గురించి నాకు సమాచారం ఇచ్చారు. ఇకపై అటెండర్లతో రాత్రి సమయంలో పర్యవేక్షించేలా చూస్తాం.
–శ్రీనివాసులుశెట్టి, వార్డెన్, బీసీ సంక్షేమ వసతిగహం

మరిన్ని వార్తలు