కరువు, చంద్రబాబు కవలలు

22 Jul, 2017 23:08 IST|Sakshi
కరువు, చంద్రబాబు కవలలు
- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శ
- మునగాలలో ఇంటింటి ప్రచారం 
 
నంద్యాలరూరల్‌: కరువు, చంద్రబాబు కవల పిల్లల్లాంటి వారని పుంగనూరు శాసన సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కవల పిల్లల మధ్య విడదీయరాని సంబంధం ఉంటుందని, ఇదే తరహాలో చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ కరువు ఉంటుందని తెలిపారు. మండల పరిధిలోని మునగాల గ్రామంలో శనివారం సర్పంచ్‌ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇటు వర్షం రాక, అటు కాల్వకు నీరు రాక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామ రైతులు ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తెచ్చారు.  దీనిపై ఆయన స్పందిస్తూ చంద్రబాబు గత తొమ్మిదేళ్ల పాలనలో రైతులు కరువు కాటకాలతో అల్లాడి పోయారన్నారు. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి నెలకొందన్నారు.  అరకొరగా పండిన పంటలకు సైతం గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
 
చంద్రబాబు హయాంలో రైతులకు మంచి రోజులు రావన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ. 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుకు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారని, చంద్రబాబు మాత్రం రూ. 5వేల కోట్లు ఇస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఆ ఊసెత్తలేదన్నారు. వైఎస్సార్‌ పాలనలో రైతులు కరువును చూడలేదని, మళ్లీ రాజన్న రాజ్యం వచ్చేలా రైతులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తండ్రి బాటలో నడుస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రైతుల అండదండలు ఎంతో అవసరమన్నారు. అధికారంలోకి వస్తే చిన్న, సన్న కారు రైతులకు నాలుగేళ్లపాటు ఏటా రూ.12,500 చొప్పున ఇచ్చేందుకు ప్లీనరీలో హామీ ఇచ్చారని చెప్పారు. చెప్పిన మాట అమలు చేయడం జగన్‌కే సాధ్యమన్నారు.
 
నంద్యాల ఉప ఎన్నికలో సౌమ్యుడు, పరిపాలన అనుభవం ఉన్న శిల్పామోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు పునాది వేయాలని కోరారు.  ప్రచారంలో పీలేరు, సత్యవేడు, పూతలపట్టు ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి,  నారాయణస్వామి,  సునిల్‌కుమార్, వేపంజరి వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి ఆదిమూలం, నాయకులు ఖలీల్‌ అహమ్మద్, మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య,  మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్లు విజయశేఖర్‌రెడ్డి, పురుషోత్తమరెడ్డి, పోలూరు మహేశ్వరరెడ్డి, మునగాల మాజీ సర్పంచ్‌ నాగపుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. 
 
 
మరిన్ని వార్తలు