కరువు కోరలు

4 Mar, 2017 00:04 IST|Sakshi
కరువు కోరలు
 చింతలపూడి/జంగారెడ్డిగూడెం/టి.నరసాపురం : మెట్ట ప్రాంతంలో కరువు కోరలు చాస్తోంది. గత ఏడాది తొలకరిలో తప్ప గడచిన ఆరు నెలల్లో వరుణుడు మొహం చాటేయడంతో భూగర్భ జలమట్టాలు దారుణంగా పడిపోతున్నాయి. సాగునీటికి కొరత ఏర్పడటంతో పంటలు ఎండిపోయే పరిస్థితి తలెత్తుతోంది. మరోవైపు వేసవికి ముందే ప్రజలు తాగునీటికి అల్లాడాల్సిన దుస్థితి దాపురిస్తోంది. మెట్ట మండలాల్లో ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే.. మే నెలలో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. భూగర్భ జలాలపై ఆధారపడిన ప్రాంతాల్లోని పరిస్థితి మరీ 
అధ్వాన్నంగా ఉంది. ఇప్పటికే చాలాచోట్ల్ల చెరువులు ఎండిపోవడంతో పశువులకు సైతం తాగునీరు అందటం లేదు. ప్రాజెక్టుల్లో  నీరు ఉంటే భూగర్భ జలాలు ఎంతోకొంతో ఆశాజనకంగా ఉండేవి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తొలకరి వానలు వచ్చేవరకు అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని, వర్షాలు కురిసి ప్రాజెక్టుల్లోకి నీరు చేరితే తప్ప కష్టాల నుంచి గట్టెక్కలేమని ఇరిగేష¯ŒS డీఈ అప్పారావు చెబుతున్నారు.
చెరువులు, ప్రాజెక్టులు వెలవెల
జిల్లాలో మధ్యతరహా నీటి పారుదల కింద తమ్మిలేరు, ఎర్రకాలువ, విజయరాయి ఆయకట్టు ఉండగా చిన్ననీటి పారుదల కింద జల్లేరు జలాశయంతోపాటు 1,398 సాగునీటి చెరువులున్నాయి. వీటిలో తమ్మిలేరు, ఎర్రకాలువ, విజయరాయి ఆయకట్టు కింద 43,500 ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. చిన్న నీటిపారుదలకు సంబంధించి జల్లేరు జలాశయం, చెరువుల కింద కలిపి 1,19,284 ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. రబీ పంట లకు నీరు విడుదల చేస్తుండటంతో ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో నీరు క్రమేణా తగ్గిపోతోంది.
ఎర్రకాలువ పరిస్థితి ఇదీ
చింతలపూడి మండలం శెట్టివారిగూడెం వద్ద మేడవరపు చెరువు అలుగు నుంచి వచ్చే నీటి వనరులే ఎర్రకాలువకు ఆధారం. ఇక్కడి నుంచి సుమారు 21 కిలోమీటర్ల మేర నీరు ప్రవహించి ఎర్రకాలువ ప్రాజెక్టులో కలుస్తోంది. అలాగే సుమారు 19 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కొంగువారిగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ ప్రాజెక్టుకు సైతం ఈ కాలువే ప్రధాన వనరుగా ఉంది. జలాశయం నీటిమట్టం 83.5 మీటర్లు కాగా ప్రస్తుతం 80 మీటర్లకు చేరుకుంది. ఈ ఏడాది రబీలో ఈ ప్రాజెక్టు నుంచి 10 వేల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తున్నట్టు ఇరిగేష¯ŒS అధికారులు చెబుతున్నారు. 
ఎండిన నందమూరి విజయసాగర్‌
ఏటా వర్షాకాలంలో వృథాగా పోతున్న వేలాది క్యూసెక్కుల ఎర్రకాలువ వరద నీటిని పంటలకు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో పోలవరం నియోజకవర్గంలోని టి.నరసాపురం సమీపంలో నందమూరి విజయసాగర్‌ ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మించింది. దీనికింద అధికారికంగా సుమారు వెయ్యి ఎకరాలు, అనధికారికంగా మరో వెయ్యి ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ఎర్రకాలువ వట్టిపోవడంతో నందమూరి విజయసాగర్‌ ప్రాజెక్ట్‌ సైతం ఎండిపోతోంది.
ఎత్తిపోతలు అంతంతే..
ఎర్రకాలువపై ఆధారపడి ఉన్న మరో ప్రాజెక్టు బొర్రంపాలెంలోని వెంగళరాయ ప్రాజెక్టు. దీనికింద సుమారు వెయ్యి ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. అంతేకాక వెంగళరాయ ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా కామవరపుకోట మండలంలో సుమారు 3 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. మూడేళ్లుగా ఎత్తిపోతల నీటితో ఆ మండలం సస్యశ్యామలమైంది. పై రెండు ప్రాజెక్టులు ఎర్రకాలువపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ ఏడాది రబీలో రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి అధికారులు అనుమతించారు. ఎర్రకాలువ వట్టిపోవడంతో ఎత్తిపోతల పథకానికి నీరందని పరిస్థితి నెలకొంది.
తగ్గుతున్న తమ్మిలేరు
చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం సమీపంలో 3 టీఎంసీల సామర్థ్యం గల జలాశయాన్ని నిర్మించారు. ప్రాజెక్టు దిగువన పశ్చిమ గోదావరి జిల్లాలో 4,200 ఎకరాలు, కృష్ణా జిల్లాలో 4,969 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. ఇదికాక సుమారు రూ.10 కోట్ల వ్యయంతో చింతలపూడి మండలంలోని 27 గ్రామాలకు తమ్మిలేరు తాగునీటి పథకం నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్టులో నీరు ఉంటేనే చుట్టుపక్కల మండలాల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 355 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 336 అడుగుల  నీటిమట్టం ఉంది. దీంతో పలు గ్రామాల్లో భూగర్భ జలాల నీటిమట్టం పడిపోతోంది. పంటల పరిస్థితి ప్రమాదంలో పడింది.  
 
మరిన్ని వార్తలు