రోడ్డుకు మరమ్మతులు కరువు

17 Aug, 2016 00:08 IST|Sakshi
రోడ్డుకు మరమ్మతులు కరువు
పెద్దవూర : మండలంలోని ఊట్లపల్లి ఘాట్‌కు పుష్కర స్నానాలకు వెళ్లేందుకు గాను భక్తుల సౌకర్యార్థం పోతునూరు–పులిచర్ల రోడ్డు వెంట పెరిగిన కంపచెట్లను తొలగించి మట్టిపోశారు. కానీ రోలింగ్‌ మరిచిపోవడంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. వాస్తవానికి ఈ రోడ్డు మరమ్మతులకు ప్రభుత్వం పుష్కర నిధులు మంజూరు చేయలేదు. మండల కేంద్రంతోపాటు చాలా గ్రామాల ప్రజలకు ఊట్లపల్లి ఘాట్‌కు పోవటానికి పోతునూరు–పులిచర్ల రోడ్డు అనువైనది. దీంతో అధికారులు 14 ఫైనాన్స్‌ నిధుల నుంచి కంపచెట్లను తొలగించి రోడ్డును మరమ్మతులు చేయించాలని సర్పంచ్‌లను ఆదేశించారు. దీంతో పులిచర్ల, పోతునూరు సర్పంచ్‌లు రోడ్డుకు ఇరువైపులా మట్టిని పోశారు. కాని మట్టిని రోలింగ్‌ చేయటం మరిచిపోయారు. అసలే సింగిల్‌ రోడ్డు. ఆపై ఎదురుగా వాహనం వస్తే తప్పనిసరిగా రోడ్డు వాహనం కిందికి దిగాల్సిందే. మట్టిని పోసి రోలింగ్‌ చేయకపోవడం వలన రోడ్డు దిగితే టైర్లు స్లిప్‌ అయ్యి కింద పడిపోతున్నాయి. వర్షాలు వస్తే ఈ రోడ్డుపై వెళ్లే వాహనదారులకు నరకం కనిపించటం ఖాయం. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు వెంట పోసిన మట్టిని రోలింగ్‌ చేయించాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.
 
మరిన్ని వార్తలు