కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌

6 Aug, 2016 23:39 IST|Sakshi
కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌
  • మునిగిన లోలెవల్‌ వంతెన
  • పట్టించుకోని అధికారులు
  • వారంరోజులుగా బడికి బందయిన పిల్లలు
  • వెల్గటూరు : ఎల్లంపెల్లి బ్యాక్‌వాటర్‌లో మునిగిన కోటిలింగాల లోలెవల్‌ వంతెనకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఆదేశాలను ఇంజినీరింగ్‌ అధికారులు బేఖాతర్‌ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కలెక్టర్‌ వంతెనను పరిశీలించి ప్రత్యామ్నాయంగా  పాషిగాం నుంచి మొయిన్‌రోడ్డు వరకు కెనాల్‌ రోడ్డుకు మొరం పోయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఆమె ఆదేశాలతో రెండు లైఫ్‌ జాకెట్లు, రెండు ట్యూబులను మాత్రం తెచ్చి వంతెన వద్ద పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు.
     
    వారం రోజులుగా రాకపోకలు బంద్‌
    వంతెన మునిగిపోవడంతో వారం రోజులుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాల్లో వెల్గటూరులోని సూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. వారం రోజులుగా స్కూల్‌కు వెళ్లడం లేదని,  అయిపోయిన పాఠాలు తిరిగి ఎలా నేర్చుకుంటామని పదో తరగతి విద్యార్థిని రమ్య ఆందోళన వ్యక్తం చేసింది. వివిధ అవసరాల కోసం ఇతర గ్రామాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. వంతెన మునిగి ఇబ్బందులు పడుతుంటే అధికారులు పట్టించుకోవడం లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు గ్రామస్తులంటే అంత అలుసా అంటూ గ్రామానికి చెందిన బయ్య సాగర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆర్‌అండ్‌బీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా పని పూర్తి కాలేదు. ఎందరికీ చెప్పిన మా బాధలు తీరడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే నిర్వాసితులకు ఇతర గ్రామాలతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. 
     
     

     

మరిన్ని వార్తలు