కాటేస్తే కాటికే!

11 Feb, 2017 22:51 IST|Sakshi
కాటేస్తే కాటికే!
  • పేరుకే ఆరోగ్య కేంద్రాలు  
  • కుక్క, పాముకాట్లకు మందుల కొరత
  • నెల్లూరు(అర్బన్‌) : కాలం కలిసిరాక కాలనాగు కాటేస్తే.. లక్కు సరిగా లేక కుక్క పిక్క పీకేస్తే జిల్లావాసులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఖర్మ కాలితే కాటికి చేరాల్సి వస్తోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటుకు విరుగుడు ఇంజక్షన్లు లేకపోవడం, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పాముతో పాటు కుక్కకాట్లకు కూడా మందుల్లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దాస్పత్రికి వెళ్లాల్సి వస్తోంది. అయితే అధికశాతం మంది ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

    పేరుకే పట్టణ ఆరోగ్య కేంద్రాలు
     ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో(పీహెచ్‌సీ)లాగా పట్టణ ఆరోగ్యకేంద్రాల(యూహెచ్‌సీ)ను తీర్చిదిద్దుతామంటూ 2000 సంవత్సరంలో ప్రభుత్వం జిల్లాలో 15 పట్టణ ఆరోగ్యకేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు మెరుగైన, అత్యవసరమైన సేవలను అందించేందుకు అంటూ వాటిని ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాలుగా మార్చి నిర్వహణను అపోలో ఆస్పత్రి యాజమాన్యానికి అప్పగించింది. ఇవి పేరుకే పట్టణ ఆరోగ్య కేంద్రాలుగా ఉన్నాయి.  ఈ ఆరోగ్య కేంద్రాల్లో కుక్కకాటు, పాము కాటు లాంటి ప్రమాదకరమైన వాటికి ఇంజక్షన్లు లేవు. కుక్కకాటుకి ఏఆర్‌వీ(యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌), పాముకాటుకి ఏఎస్‌వీ (యాంటీ స్నేక్‌ వీనమ్‌) ఇవ్వాల్సి ఉంది. ఇవి పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో లేకపోవడంతో రోగులు జిల్లా కేంద్రానికి ఉరుకులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.  25 రకాల పరీక్షలు చేసి రోగులకు సేవలందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు వచ్చేవారికి రోజుకి 5 మందికి మించి రక్త పరీక్షలు చేయకూడదని అపోలో యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.  

    పేట్రేగుతున్న శునకాలు
    జిల్లాలో ఏదో ఒక మూల ప్రతి రోజు కుక్క కాటుకి గురవుతున్న ప్రజలు కనిపిస్తూనే ఉన్నారు. వీరికి సకాలంలో ఏఆర్‌వీ ఇంజక్షన్లు ఇవ్వాలి. లేదంటే పిచ్చిపడుతుంది. గత పదేళ్లకు పైగా కుక్కల నియంత్రణకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఒక్క నెల్లూరు నగరంలోనే కుక్కల సంతతి 17 వేలకు పైగా పెరిగిందని అధికారులు అంచనావేశారు. చట్టం ప్రకారం కుక్కల నియంత్రణకు కార్పొరేషన్, స్థానిక సంస్థలు వాటికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించాలి. 10 ఏళ్ల క్రితం మాత్రమే నెల్లూరు నగరంలో అరకొర ఆపరేషన్లు జరిగాయి. తరువాత ఆపరేషన్లు మాట మరిచారు. నగరంలో కుక్కల నియంత్రణకు అంటూ ఒక న్యాయవాది స్వచ్ఛందసంస్థ పేరుతో  కల్లూరుపల్లి వద్ద 5 ఎకరాల స్థలాన్ని పొందారు. ఆ స్థలం విలువ కోట్లాది రూపాయలు. అయితే కుటుంబ నియంత్రణ జరగలేదు. అక్కడకు వీధి కుక్కలను తరలించలేదు. దీంతో కుక్కల సంతతి విపరీతంగా పెరిగి పోయింది. పెద్దాస్పత్రిలో రోజుకి 22 నుంచి 27 మంది వరకు కుక్కకాటుకి ఇంజక్షన్‌లు వేయించుకుంటున్నారు. అలాగే రెడ్‌క్రాస్‌ ఏఆర్‌వీ సెంటర్లో రోజుకి 60 నుంచి 70 మంది వరకు ఇంజక్షన్లు వేయించుకుంటున్నారు. ఒక్కో పీహెచ్‌సీలో సరాసరి రోజుకి ముగ్గురు నుంచి నలుగురు కుక్కకాటుకి ఇంజక్షన్లు వేయించుకుంటున్నారు.  

    పిహెచ్‌సీల్లోనూ ఇబ్బందులే..
    జిల్లాలో 75 పీహెచ్‌సీలున్నాయి. 14 సీహెచ్‌సీలున్నాయి. పీహెచ్‌సీల్లో కుక్కకాటుకి, పాముకాటుకి మందులున్నాయి. గత సంవవత్సరం కన్నా ఈ సంవత్సరం సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో వీటికి సంబంధించిన ఇంజక్షన్లు నిల్వ ఉన్నాయి. అయితే కొన్ని పీహెచ్‌సీల నుంచి డాక్టర్లు సకాలంలో ఇండెట్లు పెట్టనందున అలాంటి పీహెచ్‌సీలకు సకాలంలో ఈ ఇంజక్షన్లు అందడం లేదని తెలుస్తోంది. ఆస్పత్రి అభివృద్ధి నిధుల   (హెచ్‌డీఎఫ్‌) నుంచి అత్యవసరమైన ఇంజక్షన్లు డాక్టర్లు కొనుగోలు చేయవచ్చు. పాము కాటుకి గురైతే విషం తీవ్రతను బట్టి ఒకటి నుంచి 20 వరకు యాంటీ స్నేక్‌ వీనమ్‌ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంది. కొంతమంది డాక్టర్లు రెండు, మూడు డోసులు మాత్రమే ఇంజక్షన్లు ఇచ్చి రికార్డుల్లో ఏడెనిమిది ఇచ్చినట్టు రాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ ఇచ్చి ఎక్కువ రాసుకుని వ్యత్యాసం ఉన్న ఇంజక్షన్లుకి సంబంధించిన నగదును తమ జేబుల్లోకి వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.  

    వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంది
    అన్ని పీహెచ్‌సీల్లో సరిపడనంతా కుక్కకాటుకి ఏఆర్‌వీ, పాముకాటుకి ఏఎస్‌వీ వైల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇబ్బందిలేదు. కొరత ఏర్పడినట్టు మా దృష్టికి తీసుకొస్తే విచారించి చర్యలు చేపడుతాం.
    – డా.వరసుందరం, జిల్లా ఆరోగ్యశాఖాధికారి

మరిన్ని వార్తలు