తాగి నడిపితే రూ.25 వేల జరిమానా

17 Mar, 2017 02:44 IST|Sakshi
తాగి నడిపితే రూ.25 వేల జరిమానా

లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్‌ లేకుంటే రూ. 10వేలు ఫైన్‌
వాహనదారులు నిబంధనలు పాటించాల్సిందే
కామారెడ్డి ఎస్పీ ఎన్‌.శ్వేతారెడ్డి


కామారెడ్డి : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌ను సవరించిందని, అందులో భాగంగా మద్యం తాగి వాహనం నడిపితే రూ.25 వేల జరిమానా విధిస్తామని కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులతో ఎస్పీ మాట్లాడుతూ మోటారు వాహనాల చట్టంలో మార్పులు, చేర్పులతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే ప్రతి పోలీస్‌స్టేషన్‌కు ఒక బ్రీత్‌ ఎనలైజర్‌ యంత్రం అందిస్తున్నామని పేర్కొన్నారు. మొదటగా సీఐలు అందరికీ బ్రీత్‌ ఎనలైజర్లు అందించినట్టు చెప్పారు.

మొబైల్‌ మాట్లాడుతూ వాహనం నడిపితే రూ.5 వేలు, లైసెన్సు, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్‌ లేకుండా వాహనాలు నడిపితే రూ. 10 వేల చొప్పున, కాలుష్య నిబంధనలు పాటించని వారికి రూ. 1500, సీటు బెల్టు లేకుండా వాహనాలు నడిపితే రూ. వెయ్యి జరిమానా ఉంటుందన్నారు. నిబంధనలు అతిక్రమించి రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు జరిమానాలు చెల్లించిన వారి లైసెన్సులు జప్తు చేయడంతో పాటు రద్దు చేస్తామన్నారు. వాహనదారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లా అంతటా నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు.

సీఐలకు బ్రీత్‌ ఎనలైజర్ల పంపిణీ..
మద్యం తాగి వాహనాలను నడపకుండా కఠినంగా వ్యవహరించేందుకు గాను ప్రభుత్వం ప్రతి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌కు బ్రీత్‌ ఎనలైజర్లను ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలోని ఆయా సర్కిళ్ల ఇన్‌స్పెక్టర్లకు బ్రీత్‌ ఎనలైజర్లను ఎస్పీ శ్వేతారెత్డా అందజేశారు. రోడ్లపై మద్యం సేవించి వాహనాలను నడిపితే వారిని గుర్తించేందుకు బ్రీత్‌ ఎనలైజర్లను వాడుతారు. ఇందులో మద్యం తాగినట్టు తేలితే వారిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేసి భారీ మొత్తంలో జరిమానా వసూలు చేస్తారు. జిల్లాలోని ఆయా సర్కిళ్ల ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు