గిరిజన సంక్షేమ శాఖలో 'కోల్డ్‌'వార్!

13 Jul, 2016 01:38 IST|Sakshi
గిరిజన సంక్షేమ శాఖలో 'కోల్డ్‌'వార్!

గుంటూరు వెస్ట్ : జిల్లా గిరిజన సంక్షేమశాఖాధికారి(డీటీడబ్ల్యుఓ) పోస్టు కోసం ఇద్దరు అధికారుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఆ పోస్టులో ఉన్న అధికారి అక్కడే కొనసాగేందుకు, మరో అధికారి ఏవిధంగానైనా పోస్టును దక్కించుకునేందుకు  చేస్తున్న ప్రయత్నాలు ఆ శాఖలో తీవ్రచర్చకు దారితీశాయి. ఆ ఇద్దరు అధికారుల తీరుతో విస్తుబోతున్న కిందిస్థాయి సిబ్బంది ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందోనని ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుత డీటీడబ్ల్యుఓ వీ.నారాయణుడును చిత్తూరు జిల్లా డీటీడబ్ల్యుఓగా నియమిస్తూ ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు జారీఅయినట్టు సమాచారం.    

గత ఏడాది ఆగస్టు 22న నారాయణుడు ఇక్కడ బాధ్యతలు స్వీకరించారు. ఏడాది కూడా పూర్తికాకుండానే ఆయనను చిత్తూరు జిల్లాకు బదిలీ చేయడం వెనుక చాలాతతంగం నడిచినట్టు ఉద్యోగవర్గాల్లో చర్చనడుస్తోంది. అలాగే ఏటీడబ్ల్యుఓ ఎం.ఈశ్వరరావుకు ఇన్‌చార్జి డీటీడబ్ల్యుఓగా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈశ్వరరావును చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి డీటీడబ్ల్యుఓగా నియమిస్తూ ఉన్నతాధికారులు గతనెలలో ఉత్తర్వులు జారీచేశారు.  ఆయన జూన్ 30 తేదీనే ఇక్కడి నుంచి రిలీవ్ కావాల్సి ఉంది. కానీ రిలీవ్‌కాలేదు.  ఈశ్వరరావుది ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను మండలం.

చిత్తూరు జిల్లాకు బదిలీపై వెళ్లడం ఇష్టంలేని ఆయన ఈ జిల్లాలోనే పోస్టింగ్ కేటాయించాలని ప్రత్తిపాడు నియోజకవర్గంలో కీలకపాత్ర పోషిస్తున్న అధికార పార్టీ నేత ద్వారా ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్టు తెలిసింది.  తనకు బదులుగా నారాయణుడును చిత్తూరు జిల్లాకు పంపించాలని కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో అధిక మొత్తంలో నగదు చేతులు మారినట్టు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఈక్రమంలోనే ఈశ్వరరావు ఈనెల 11వ తేదీ నుంచి 15 రోజులపాటు సెలవుపై వెళ్లిపోయారు.
 
సీటు కాపాడుకునేందుకు నారాయణుడు విశ్వప్రయత్నాలు
తాను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పాలనకు సంబంధించిన వ్యవహారాలు, ఇతరత్రా సమస్యలు తలెత్తిన సమయంలో నారాయణుడు జిల్లాలో సీనియర్ ఏటీడబ్ల్యుఓ అయిన ఈశ్వరరావు ద్వారా వాటిని పరిష్కరించే వారని తెలిసింది. ఇప్పుడు తనసీటుకే ఎసరువస్తుండడం ఆయనకు మింగుడుపడడం లేదు. ఉన్నతాధికారులతో ఈవిషయమై పలుమార్లు చర్చించినట్లు తెలిసింది.  నిబంధనలు ప్రకారం తన బదిలీ జరగదని, అదేవిధంగా జిల్లాకు చెందిన ఏటీడబ్ల్యుఓకు ఇన్‌చార్జి డీటీడబ్ల్యుఓగా ఇవ్వడం కుదరదని ఆయన చెబుతున్నారు. ఏమైనా ఇక్కడే కొనసాగేవిధంగా ఆయన తన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు