దుబాయ్‌ అలీవుద్దీన్‌ అరెస్ట్‌

13 Nov, 2016 23:48 IST|Sakshi
దుబాయ్‌ అలీవుద్దీన్‌ అరెస్ట్‌

కడప అర్బన్‌ : తమిళనాడు రాష్ట్రం చెన్నై నివాసి, న్యాయవాది ఐన మహ్మద్‌ అలీవుద్దీన్‌ దుబాయ్‌ ఉంటూ, అక్కడి నుంచే ప్రధాన అంతర్జాతీయ ఎర్ర స్మగ్లర్‌ సాహుల్‌భాయ్‌కు వెన్నుదన్నుగా వుండేవాడని అతన్ని, మరో ఐదుగురు అనుచరులను అరెస్ట్‌ చేసినట్లు జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబాయ్‌లో నివాసం ఉంటున్న అలీవుద్దీన్‌తో పాటు అతని ఐదుగురు ప్రధాన అనుచరులను మైదుకూరు – బద్వేల్‌ రహదారిలో కుడాలి గ్రామం వద్ద ఫారెస్ట్‌ చెక్‌పోస్టు సమీపంలో ఆదివారం నిర్వహించిన వాహనాల తనిఖీలో అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి 2.1 టన్నుల బరువున్న 101 ఎర్రచందనం దుంగలు, ఒక కారు, ఒక లారీ, 6 సెల్‌ఫోన్‌లు, రూ. 2వేలు నగదు, విదేశీ కరెన్సీలో 10 యుఎస్‌డాలర్స్‌– 1, 5 బహ్రెయిన్‌ దినార్ల నోట్‌–1, 1 ఖతర్‌ రియాల్‌ నోట్లు –3, రూ. 100, 50 శ్రీలంక నోట్లు– 2, రూ. 20ల శ్రీలంక నోట్లు–6 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
– అలీవుద్దీన్‌ వృత్తి రీత్యా న్యాయవాదిగా ఉంటూ అంతర్జాతీయ స్మగ్లర్‌గా ఎదిగాడు. దుబాయ్‌కి చెందిన అంతర్జాతీయ స్మగ్లర్‌ సాహుల్‌ హమీద్‌ అలియాస్‌ సాహుబ్‌భాయ్‌కి న్యాయవాదిగా ఉంటూ ఎర్రచందనం అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఇతని సహాయ సహకారాలతో సాహుల్‌భాయ్‌ దుబాయ్, మలేషియా, చైనా, సింగఫూర్, హాంకాంగ్, శ్రీలంక దేశాలలో ఎర్రచందనం కార్యకలాపాలు కొనసాగించేవాడు.
– 1996 నుంచి మద్రాసు హైకోర్టులో  న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్న అలీవుద్దీన్‌ చెన్నైలోని కేంద్ర కారాగారంతోపాటు ఇతర కారాగారాల్లో క్రిమినల్‌ కేసుల్లో ఉన్న వారిని కలుస్తూ వారికి న్యాయపరంగా సహకరించేవాడు. ఈ క్రమంలో 2004వ సంవత్సరంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ, ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ)కి చెందిన స్మగ్లింగ్‌ కేసులో చెన్నై నగరంలోని కేంద్ర కారాగారంలో సాహుల్‌భాయ్, సంతాన్‌ మీరన్‌లతో పరిచయం ఏర్పడింది. ఈ కేసులో సాహుల్‌భాయ్‌కి బెయిలు ఇప్పించాడు.  అప్పటి నుంచి సాహుల్‌భాయ్, అతని అనుచరులు అలీవుద్దీన్‌ను తరుచుగా న్యాయ సహాయం కోసం సంప్రదించేవారు.  స్మగ్లర్లకు చెందిన కేసులను హైకోర్టుతోపాటు డీఆర్‌ఐ బోర్డులోనూ వాదించేవాడు. ఎర్రచందనం స్మగ్లర్లు తక్కువ సమయంలో రూ. కోట్లలో ఆర్జిస్తుండడంతో అలీవుద్దీన్‌ కూడా అక్రమార్జనకు ఆకర్శితుడై సాహుల్‌భాయ్‌ సలహా మేరకు ఎర్రచందనం కార్యకలాపాల్లోకి ప్రవేశించాడు. 2011లో సాహుల్‌భాయ్‌ దుబాయ్‌లో స్థిరపడ్డాడు.  అలీవుద్దీన్‌ సాహుబ్‌భాయ్‌కి చెందిన ఎర్రచందనం కార్యకలాపాలన్నీ పర్యవేక్షించేవాడు.  2015లో సాహుల్‌భాయ్‌కి ఎర్రచందనం దుంగలు ఎగుమతి చేసే తమిళనాడులోని కొందరు కీలక అనుచరులైన స్మగ్లర్లను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో వారు సాహుల్‌భాయ్‌కి న్యాయవాదిగా ఉంటూ స్మగ్లర్‌గా మారిన అలీవుద్దీన్‌ వివరాలను వెల్లడించారు. ఇతనిపై జిల్లాలో 11 కేసులు, చిత్తూరుజిల్లాలో 7 కేసులు నమోదయ్యాయని ఎస్‌పీ వివరించారు.
– ఇతనితోపాటు దువ్వూరు గ్రామానికి చెందిన అవిలి పోలయ్య,  ప్రొద్దుటూరు మండలం రేగళ్లపల్లె గ్రామానికి చెందిన మడకబాబు,  తమిళనాడు సేలంకు చెందిన గోవిందరాజు, చిత్తూరుజిల్లా పూతలపట్టుకు చెందిన పి.చంద్ర, మెట్టూరుకు చెందిన మహమ్మద్‌ ఇమ్రాన్‌లపై పలు కేసులు ఉన్నాయని, వీరిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

మరిన్ని వార్తలు