చదువుకున్న అజ్ఞాని మంత్రి పల్లె..

7 Jan, 2017 23:48 IST|Sakshi

అమడగూరు : ఉన్నత చదువులు చదువుకున్నా మంత్రి పల్లె రఘునాథరెడ్డి అజ్ఞానిలా ప్రవర్తిస్తున్నాడని పుట్టపర్తి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన జేకేపల్లిలో శనివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ దున్నపోతు ఈనిందంటే గాటికి కట్టేయమన్నట్లు, బుక్కపట్నం చెరువు వివరాలు తెలియజేయాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టరును ఆదేశించిన వెంటనే ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి పల్లె రఘునాథరెడ్డి తమ్ముళ్లకు పోటీలు పెట్టించి మరీ చెరువులో పని చేయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పనులు చేయాలంటే ముందుగా అధికారులు ఎస్టిమేషన్‌ తయారు చేసి, టెండర్లు పిలిచి సంబంధింత కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాల్సి ఉందన్నారు. అయితే మండలాధికారులకే తెలియకుండా దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు చెరువులో పడి పనులు చేసుకోవడం ఏమాత్రం సమంజసం అని దుయ్యబట్టారు. మంత్రి పల్లె అండదండలతోనే తెలుగు తమ్ముళ్లంతా ఇలా తెగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులో పిచ్చిమొక్కల తొలగింపు (జంగిల్‌ క్లీనింగ్‌) పేరుతో రూ.3 కోట్లకు ఎసరు పెట్టారని మండిపడ్డారు. అంతేకాక చెరువులో అంత లోతుగా గుంతలు తీయడం ద్వారా నీటి నిల్వ ఎక్కువై చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ముందన్నారు.

ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు ఏమీ ఎరగనట్టు చోద్యం చూస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు చొరవచూపి అనుమతులు లేకుండా ప్రభుత్వ చెరువులో పనులు చేయించిన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డీఎస్‌ కేశవరెడ్డి, కన్వీనర్‌ శేషూరెడ్డి, బుక్కపట్నం కన్వీనర్‌ సుధాకర్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, నాగరాజు, బొట్టుస్వామి, నక్కలచిన్నప్ప, జయప్ప, సురేంద్రరెడ్డి, లోకేష్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, లక్ష్మిరెడ్డి, శివయ్య తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు