మూగబాలుడు దారుణ హత్య

4 Sep, 2016 16:45 IST|Sakshi
సంతోష్‌ (ఫైల్‌ఫొటో)
  • అమావాస్య రాత్రి అదృశ్యమై... శవమై కన్పించిన వైనం
  • క్షుద్రపూజలకు బలయ్యాడనే అనుమానాలు..?

  • పాల్వంచ రూరల్‌(ఖమ్మం): ఓ మూగ బాలుడు దారుణ హత్యకు గురైన సంఘటన పాల్వంచ మండలంలో చోటు చేసుకుంది. ఈ నెల 1వ తేదీన అమావాస్య రోజు అదృశ్యమైన ఆ బాలుడు మూడు రోజుల తర్వాత శవమై కన్పించాడు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని వికలాంగుల కాలనీకి చెందిన రాసమల్ల రమేష్, రమాదేవిల దంపతులకు ముగ్గురు సంతానం. మూడో కుమారుడు సంతోష్‌ (9)కు మాటలు రాకపోవడంతో కాంట్రాక్ట్‌ కాలనీలో గల చెవిటి, మూగ పాఠశాలలో చదువుతున్నాడు. ఈ నెల 1వ తేదీన సాయంత్రం అదే వీధికి చెందిన మరో బాలుడు హరిమాధవ్‌ సంతోష్‌ ఇంటికి వచ్చి ఆడుకునేందుకు  రమ్మని తీసుకెళ్లాడు.

    తిరిగి సంతోష్‌ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాలుడి కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. శనివారం చెత్తను పారవేసేందుకు వెళ్లిన ఆ కాలనీ మహిళకు సమీపంలోని చెట్ల పొదల మధ్య బాలుడు విగతజీవిగా కనిపించాడు. మృతదేహం ఉందన్న సమాచారం పోలీసులకు తెలియడంతో సీఐ షుకూర్, ఎస్సై కృష్ణయ్యలు సంఘటన స్థలానికి చేరుకున్నారు.  సంతోష్‌ మృతదేహంగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. బాలుడి ముఖం ఒకవైపు, కుడి చేయికి చెందిన చర్మం పూర్తిగా ఊడిపోయి, ఎముకలు బయటకు కన్పిస్తున్నాయి.

    మృతదేహం సైతం దుర్వాసన వస్తుండటంతో రెండు రోజుల క్రితమే హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ షుకూర్‌ తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. కాగా అమావాస్య రాత్రి సంతోష్‌ అదృశ్యం కావడం, అనంతరం హత్యకు గురికావడం, మృతదేహం వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ఉండటం చూస్తుంటే క్షుద్రపూజల కోసం సంతోష్‌ను హతమార్చి ఉంటారని స్థానికులు భావిస్తుండగా, దానిలో నిజం లేదని సీఐ చెప్పారు. మిస్టరీగా మారిన మూగబాలుడు సంతోష్‌ హత్యను పోలీసులు ఏ విధంగా ఛేదిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఇదిలా ఉండగా సంతోష్‌తో ఆడుకునేందుకు తీసుకెళ్లిన హరిమాధవ్‌ మాత్రం నరేష్‌ అనే వ్యక్తి సంతోష్‌ను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడని, చూస్తే గుర్తు పడతానని చెప్తుండటం గమనార్హం. సంతోష్‌ హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్తున్నారు.

మరిన్ని వార్తలు