నివాసాల మధ్య నకిలీ బాగోతం

26 May, 2017 22:21 IST|Sakshi
నివాసాల మధ్య నకిలీ బాగోతం
బీటీ పత్తి విత్తనాల గుట్టురట్టు
- విజిలెన్స్‌ అధికారుల మూకుమ్మడి దాడులు
- కల్లూరు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని పోలీసు కాలనీలో రూ.55 లక్షల నకిలీ విత్తనాలు స్వాధీనం
- 3వేలు ప్యాకెట్లు, ప్యాకింగ్‌కు సిద్ధంగా ఉన్న 3వేల కిలోల విత్తనాలు సీజ్‌
 
కర్నూలు(అగ్రికల్చర్‌): ఖరీఫ్‌ సీజన్‌ మొదలు కానున్న నేపథ్యంలో నకిలీ విత్తనాలు భారీగా పట్టుబడ్డాయి. బిటీ పత్తి విత్తనాలకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అనుమతి ఉండగా.. అదే అడ్రస్‌తో కర్నూలులో విత్తన ప్యాకెట్లు తయారు చేసి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా చేస్తుండటం గమనార్హం. గురువారం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారులు కర్నూలులో గుట్టుగా సాగుతున్న నకిలీ విత్తనాల రాకెట్‌ను రట్టు చేశారు. ఏకంగా రూ.55 లక్షలకు పైగా నకిలీ బీటీ పత్తి విత్తనాలను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో నకిలీ విత్తనాలకు అడ్డా కర్నూలు అనే విషయం మరోసారి నిరూపితమైంది. ‘సాక్షి’లో గత బుధవారం నకిలీ విత్తనాలపై ‘తెల్ల బంగారం.. విత్తు కలవరం’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించడంతో నకిలీ బాగోతం వెలుగులోకి వచ్చింది.
 
రీజినల్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ అధికారి బాబురావుకు వచ్చిన సమాచారం మేరకు ఆయన ఆదేశాలతో విజిలెన్‌ ఏడీఏ వెంకటేశ్వర్లు, విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాసరెడ్డి, రామకృష్ణాచారి, జగన్‌మోహన్, కానిస్టేబుళ్లు శేఖర్, శివరాముడు, గౌడులు కల్లూరు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని పోలీసు కాలనీపై నిఘా వేశారు. పోలీసు కాలనీలోని డోర్‌ నెం.77/180–7–1–3 ఇంటిలో బీటీ విత్తన ప్యాకెట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆ మేరకు విజిలెన్స్‌ అధికారులు మూకుమ్మడిగా దాడి చేశారు. నివాస ప్రాంతాల మధ్య భారీ ఎత్తున నకిలీ విత్తనాల రాకెట్‌ సాగుతుండటం చూసి అధికారులే విస్తుపోయారు. ఇండిగో క్రాప్‌ కేర్‌ సీడ్‌కు పశ్చిమగోదావరి జిల్లాలో అనుమతి ఉంది. బీటీ విత్తన ప్యాకెట్లను గుజరాత్‌లో తయారు చేసినట్లు ఉంది. కానీ ప్యాకెట్లు మాత్రం కల్లూరు ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లోని పోలీసు కాలనీలో తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కర్నూలు ఆదిత్యనగర్‌లో కార్యాలయం ఉన్నట్లు చూపినా.. అక్కడ అలాంటి ఆనవాళ్లు ఏవీ లేకపోవడం గమనార్హం.
 
లీడర్‌, బీజీ, రుద్ర పేర్లతో ప్యాకెట్ల తయారీ
లీడర్‌–99, బీజీ–2, రుద్ర–118, బీజీ–2 పేరుతో 3వేల ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఖాళీ ప్యాకెట్లను కూడా సీజ్‌ చేశారు. వీటిపై గుజరాత్‌లో ప్యాకెట్లు తయారు చేసినట్లు, కంపెనీ తాడేపల్లిగూడెంలో ఉన్నట్లు ఉంది. 450 గ్రాముల ప్యాకెట్‌ ధర రూ.800లుగా ముద్రించారు. ప్యాకెట్లు తయారు చేసినవి 3వేలు ఉండగా.. 7,500 ప్యాకెట్ల తయారీకి అవసరమైన విత్తనాలను సిద్ధంగా ఉంచారు. వీటి విలువను విజిలెన్స్‌ అధికారులు రూ.55లక్షలుగా చెబుతున్నా.. ముద్రించిన ధర ప్రకారం రూ.84లక్షలు ఉంటుందని తెలుస్తోంది.
 
వ్యవసాయాధికారులకు నకిలీ విత్తనాలు అప్పగింత
విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న బీటీ విత్తన ప్యాకెట్లు, బస్తాల్లో ఉన్న విత్తనాలను కర్నూలు మండల వ్యవసాయాధికారి అశోక్‌కుమార్‌రెడ్డికి అప్పగించారు. నకిలీ విత్తనాలు ఉన్న ఇంటిని కూడా సీజ్‌ చేశారు. సీడ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్లు విజిలెన్స్‌ ఏడీఏ వెంకటేశ్వర్లు తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని కర్నూలు ఏడీఏ రమణారెడ్డి, ఏఓ విశ్వనా«ద్‌ తదితరులు పరిశీలించారు.
 
మరిన్ని వార్తలు