నకి‘లీలలు’

14 Jul, 2017 12:03 IST|Sakshi
నకి‘లీలలు’

► పరిహారం అర్జీలలో కొత్త కోణం
► ముంపు వాసులకు దొంగ పత్రాలు ఇస్తూ దోచుకుంటున్న సిబ్బంది
► విచారణలో బయట పడుతున్న దొంగ పెళ్లి పత్రికలు
► పాఠశాలల్లో పేర్లు లేకపోయినా ఉన్నట్లుగా పత్రాలు సృష్టి
► ఒక్కో పత్రానికి రూ.5 వేలకు పైగానే వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు


ఎర్రగుంట్ల: గండికోట ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్థిక సామాజిక విచారణ సర్వేలో అధికారులకు వింత అనుభవం ఎదురైంది. ముంపు వాసులు పెట్టుకున్న అర్జీలలో కొన్ని నకిలీ పత్రాలు.. వారికి చుక్కలు చూపెడుతున్నాయి. పరిహారం కోసం స్థానిక ప్రభుత్వ సిబ్బందే అడ్డదారులు తొక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు గ్రామస్తుల చేత వివాహం అయినట్టుగా పెళ్లి పత్రికలు కొట్టించి, అందులో తేదీలను, సంవత్సరాన్ని, ముహూర్తం సమయాన్ని మార్చి నకిలీ పత్రాలను సృష్టించి అర్జీలు పెట్టించిన విషయం తాజాగా వెలుగు చూసింది.

ఈ అక్రమ వ్యవహారం వెనుక కొందరు అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు గురువారం ఎర్రగుంట్ల రెవెన్యూ కార్యలయంలో తహసీల్దార్‌ సమక్షంలో వీఆర్‌ఓలు విచారణ చేపట్టారు. కొండాపురంలోని అధికారులు కొందరి వద్ద నజరానాలు తీసుకుని నకిలీ పత్రాలు తయారు చేస్తున్నట్లు తెలిసింది. ఒక్కొక్క నకిలీ పత్రానికి రూ.5 వేలు చొప్పున వసూలు చేస్తున్నట్లు సమాచారం.

వెలుగుచూస్తున్న వాస్తవాలు
గండికోట ప్రాజెక్టు ముంపు గ్రామమైన కొండాపురం మండలంలోని చౌటిపల్లికి చెందిన ముంపు వాసులకు.. ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు ఆధారాలు సమర్పించాలని అధికారులు తెలిపారు. అంటే 2007 జనవరి 1 నుంచి విచారణ చేసే మధ్య కాలంలో కనీసం నాలుగేళ్లు ఆ గ్రామంలో నివాసమున్నట్లు.. అప్పటి రేషన్‌కార్డు, ఓటరు కార్డు, ఆధార్‌కార్డు, ఉపాధి హమీ జాబ్‌కార్డు, పెన్షన్‌ కార్డు పుస్తకం, బ్యాంకు పాసుబుక్, పోస్టల్‌ పుస్తకం, గ్యాస్‌ కనెక్షన్, డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్‌పోర్టులు తదితర ఆధారాలు సమర్పించాలని కోరారు. అలాగే 2007 జనవరి 1కి ముందే వివాహం అయిన వారు అర్హులు కారని తెలిపారు. 2007 జనవరి 1 తర్వాత వివాహం అయిన వారు మ్యారేజ్‌ సర్టిఫికెట్, లేదా పెళ్లి ఆధారాలు అందజేయాలని పేర్కొన్నారు.

160 అర్జీలకు ఆధారాలు లేవు
ఇలా చౌటిపల్లి నుంచి వచ్చిన 160 అర్జీలకు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. తర్వాత కొన్ని అర్జీలకు ఆధారాలు జోడించి ముంపు వాసులు ఇచ్చారని వారు పేర్కొన్నారు. వీటిలో పెళ్లి అయినట్టుగా 15 అర్జీలు, పాఠశాలలో చదివినట్టుగా 60 అర్జీలు వచ్చాయి. విచారణ చేపట్టగా వీటిలో పెళ్లి పత్రికలు నకిలీవిగా గుర్తించినట్లు తహసీల్దార్‌ మహేశ్వరరెడ్డి తెలిపారు. పెళ్లి పత్రికలలో తేదీలు, సంవత్సరాలు.. వారి వయసు మధ్య చాలా వ్యత్యాసం ఉందని, అంతేకాక కల్యాణ మండపాలకు పోయి విచారణ చేస్తే అక్కడ ఈ తేదీలలో ఏ పెళ్లి జరగలేదని రికార్డుల్లో ఉందన్నారు. అలాగే ఆయా పాఠశాలలో విచారణ చేస్తే అక్కడ కూడా వారి పేర్లు లేవని, అదే విధంగా కొన్ని స్కూల్స్‌ కూడా లేవని విచారణలో తేలిందన్నారు.

విచారణ పక్కగా చేస్తున్నాం
ముంపువాసులు నుంచి వచ్చిన అర్జీలపై విచారణను కచ్చితంగా చేస్తున్నాం. పెళ్లి అయినట్టుగా 15 అర్జీలు రాగా, అవన్నీ నకిలీవని తేలిపోయింది. అలాగే పాఠశాలల్లో చదివిన సర్టిఫికెట్లపై విచారణ చేస్తే వారి పేర్లు లేవు. ప్రభుత్వ నిబంధనల మేరకు విచారణను సాంకేతిక పద్ధతిలో చేస్తున్నాం.     –బీ మహేశ్వరరెడ్డి, తహసీల్దార్, ఎర్రగుంట్ల

మరిన్ని వార్తలు