మహామాయ

29 Jun, 2017 03:42 IST|Sakshi
మహామాయ

గరిమెనపెంట భూబాగోతంలో మరో కోణం
కొత్త రికార్డుల్లో పాత ఎంట్రీలు
వారసుల నుంచి  కొనుగోలు చేసినట్టు నకిలీ పత్రాలు
అటవీ భూమిని కాజేసేందుకు నాలుగేళ్లుగా యత్నాలు


 నెల్లూరు : రికార్డులతోపాటు సర్వే నంబర్లనూ మార్చేశారు. అటవీ భూముల్ని గ్రామకంఠంగా చూపించారు. ఏకంగా 545 ఎకరాలను స్వాహా చేశారు. కానీ.. చివరకు అడ్డంగా దొరికిపోయారు. రాపూరు మండలం గరిమెనపెంట శివారులోని అటవీ భూముల కబ్జా వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ భూముల కబ్జాపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేలా కొత్త రికార్డులు సృష్టించిన అధికార పార్టీ పెద్దలు అక్కడే దొరికిపోయారు.

పక్కా స్కెచ్‌తో..
భూముల్ని కాజేసేందుకు పక్కా ప్రణాళిక రచించిన అధికార పార్టీ పెద్దలు మొదట అటవీ శాఖ అధికారుల ద్వారానే వ్యవహారం చక్కదిద్దేందుకు యత్నించారు. గతంలో ఇక్కడ పనిచేసిన అటవీ శాఖ అధికారిపై చిత్తూరు జిల్లాకు చెందిన ప్రస్తుత మాజీమంత్రితోపాటు అటవీ శాఖ ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చారు. సదరు అధికారి ఇందుకు ససేమిరా అనటంతో రూటు మార్చారు. రెవెన్యూ శాఖ వ్యవహారాల్లో తలపండిన మేధావుల్ని, ప్రస్తుత, రిటైర్డ్‌ తహసీల్దార్లను రంగంలోకి దించారు. రెవెన్యూ అధికారులకు భూ కబ్జా ఫైల్‌ను పంపించారు. స్థానిక ప్రజాప్రతినిధితోపాటు అప్పటి మంత్రితో రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డుల  గోల్‌మాల్‌కు శ్రీకారం చుట్టారు. అలా మొదలుపెట్టి అడుగడుగునా రికార్డులను ట్యాంపరింగ్‌ చేశారు. తొలుత గ్రామ అడంగళ్‌ పుస్తకంలో ఖాతా నంబర్లు, వివరాలు నమోదు చేశారు. 1968లో 550 ఎకరాలను పట్టాలుగా ఇచ్చినట్టు రికార్డులు సృష్టించే క్రమంలో అడంగళ్‌లో వారి వారసుల పేర్లు, సర్వే నంబర్లు, భూమి వివరాలను తారుమారు చేశారు.

అది కూడా పాత అడంగల్‌ కావటంతో ఎలాంటి ఇబ్బంది ఉండదనుకున్నారు. అడంగల్‌లోని వివరాలన్నీ పాతవే అయినా అడంగల్‌ పుస్తకాన్ని ప్రభుత్వ ముద్రణాలయంలో 1985లో ముద్రించారు. నిజానికి అందులో 1985 నుంచి మాత్రమే వివరాలు నమోదు చేస్తున్నారు. అంతకుముందు 20 ఏళ్ల రికార్డులు నమోదు చేయటం సాధ్యం కాదు. అయినా.. రెవెన్యూ అధి కారులు రాజకీయ ఒత్తిళ్లతో పాత వివరాలను కొత్త పుస్తకంలో నమోదు చేసి విచారణలో బుక్‌ అయ్యారు. ఈ వ్యవహారంలో ఇద్దరు తహసీల్దార్ల పాత్ర ఉన్నట్టు తేల్చినా.. ఇప్పటివరకు ఒకరిపై మాత్ర మే చర్యలు తీసుకోవటం గమనార్హం.

విజిలెన్స్‌ విచారణలోనూ     బట్టబయలు
అధికార పార్టీ నేతలు సాగించిన భూబాగోతంపై రెవెన్యూ శాఖతో పాటు విజిలెన్స్‌ విభాగం కూడా దర్యాప్తు చేపట్టింది. గరిమెనపెంట అటవీ భూమి వందలాది ఏళ్లక్రితం అప్పటి జమీందార్లు, రాజులు అక్కడి బ్రాహ్మణులకు కేటాయించిన భూదాన మాన్యాలని దర్యాప్తులో తేలింది. 1980 తర్వాత అమల్లోకి వచ్చిన అటవీ, ఇనాం చట్టాల ద్వారా ఈ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి అధికారిక రికార్డులు లేవు. ఈ క్రమంలో సర్వే నంబర్‌ 75ను సబ్‌ డివిజన్‌ చేసి 75/1గా, 75/2గా మార్చారు. 75/1లో 14 ఎకరాల భూమికి పట్టాను కేటా యించారు. 75/2 సర్వే నంబర్‌ భూమి మొత్తం అటవీ శాఖ పరిధిలోకి రావటంతో దానిని రిజర్వ్‌ ఫారెస్ట్‌ జోన్‌గా మార్చారు. అంతకుముందే 180 ఎకరాల భూమిని కమ్యూనిటీ జాయింట్‌ ఫిర్మాంగ్‌ సొసైటీకి కేటాయించారు.

రికార్డుల్లో నమోదు కాకుండా మిగిలిన 550 ఎకరాల భూమిని స్వాహా చేయటానికి అధికార పార్టీ నేతలు ప్రణాళిక రచించారు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగి  గతంలో బ్రాహ్మణులకు కేటాయించిన భూమి కావటంతో శనగవరపు అనే ఇంటిపేరుతో ఉన్న కొందరి వివరాలను వారసుల పేరిట.. వారికి తెలియకుండానే రికార్డుల్లో నమోదు చేయించారు. మొదటగా 505 ఎకరాలను రెవెన్యూ రికార్డుల్లో చేర్చారు. రెండో దశలో 45 ఎకరాలను రికార్డుల్లోకి ఎక్కించారు. తద్వారా ఈ అటవీ భూమిని ప్రైవేటు భూమిగా మార్చే యత్నం చేశారు. ఆ భూముల్ని బినామీల పేరిట కొనుగోలు చేసినట్టు చూపించి రిజిస్ట్రేషన్‌ చేయించారు.

మరిన్ని వార్తలు