ఉడికించి చూడ రబ్బరు గుడ్డు !

15 Apr, 2017 21:09 IST|Sakshi
ఉడికించి చూడ రబ్బరు గుడ్డు !

► అంగన్‌వాడీ కేంద్రాలకు నకిలీ గుడ్లు సరఫరా

కనగానపల్లి (రాప్తాడు) : పౌష్టికాహారం పేరుతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేస్తున్న కోడిగుడ్లలో రబ్బరు అవశేషాలు బయటపడ్డాయి. స్వయానా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోనే ఈ తరహా  కోడిగుడ్లు సరఫరా కావడం గమనార్హం.

కుర్లపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో..: కనగానపల్లి మండలం కుర్లపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో ఈనకిలీ గుడ్ల ఉదంతం బయటపడింది. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం ద్వారా ఈ నెల మొదటి వారంలో 50 మంది పిల్లలకు, 15 మంది గర్భిణులకు కోడి గుడ్లు పంపిణీ చేశారు. వీటిలో సరస్వతమ్మ అనే మహిళ కూడా తన మనవడి కోసం ఎనిమిది గుడ్లను  తీసుకెళ్లారు. గురువారం సాయంత్రం వీటిని ఉడకబెట్టి పిల్లవాడికి తినిపిస్తుండగా, రబ్బరు అవశేషాలు బయటపడ్డాయి. దీంతో   కంగుతిని ఈ విషయాన్ని స్థానిక అంగన్‌వాడీ వర్కర్‌ ప్రసన్నలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం మరో గుడ్డును ఉడికించి చూడగా మరోసారి  ఇలాగే జరిగింది.  ఈ విషయాన్ని స్థానికులు విలేకరులకు తెలియజేశారు. నకిలీ గుడ్లను సరఫరా చేస్తూ చిన్నపిల్లల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని వారు మండిపడ్డారు. ఉడికించిన గుడ్డులో ఎక్కువ శాతం పచ్చసొన ఉంటూ, తెల్లసొన పలుచటి పొర మాదిరిగా కనపడుతోందని వారు వివరిం చారు. అంతేకాక పచ్చసొన జిగురుగా ఉంటూ నమిలితే రబ్బరును కొరికినట్లుగా ఉంటోందని తెలిపారు. ఇలాంటివి పిల్లలు తిని అనారోగ్యం పాలయితే బాధ్యులు ఎవరని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు