రుణం పేరిట వసూళ్లు

8 Aug, 2016 23:22 IST|Sakshi
శ్రీనివాస్‌ ఇచ్చిన నకిలీ డీడీలు
  • బ్యాంక్‌ మేనేజర్‌నంటూ మోసం 
  • చెల్లని డీడీలు ఇచ్చి దొరికిన వైనం
  • సిరిసిల్లలో వెలుగుచూసిన మోసం 
  • సిరిసిల్ల టౌన్‌ : అమాయకుల అవసరాన్ని ఆసరా చేసుకున్న ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తాను బ్యాంకు మేనేజర్‌గా పరిచయం చేసుకుని ఇల్లు కట్టుకోవడానికి రుణ ం ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడు. చివరకు నకిలీ డీడీలు అప్పగించి అడ్డంగా దొరికిపోయాడు. వేములవాడ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన పోవారి అనసూయ నాలుగేళ్ల క్రితం అగ్రహరం సమీపంలోని గుర్రంవానిపల్లె ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ సమీపంలో గుంటన్నర నివేశన స్థలాన్ని కొనుక్కుంది. ఆ ప్రాంతం అభివృద్ధి చెందడంతో తాము కూడా అక్కడే స్థిరపడాలని ఇల్లు కట్టుకోవాలనుకుంది. తన భూమిని తనఖా పెట్టి రుణం ఇప్పించాలని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఆశ్రయించగా అతడు సిరిసిల్ల సుభాష్‌నగర్‌కు చెందిన ముండ్రాయి శ్రీనివాస్‌ను పరిచయం చేశాడు. తాను ఆంధ్రాబ్యాంకు మేనేజర్‌గా పరిచయం చేసుకున్న శ్రీనివాస్‌ రూ.6.50 లక్షల రుణం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకు కొంత ఖర్చవుతుందని చెప్పడంతో అనసూయ పలు దఫాలుగా మూడు నెలల్లో రూ.70వేలు ఇచ్చింది. నెలలు గడుస్తున్నా రుణం మంజూరు చేయడం లేదని శ్రీనివాస్‌ను నిలదీయడంతో రూ.6.50 లక్షల విలువైన నకిలీ డీడీలు అందించాడు. 
    అంకెలు మార్చి... మాయ చేసి... 
    రుణం ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేసిన శ్రీనివాస్‌ బాధితులకు ఎలాంటి ఆధారాలను అందనివ్వలేదు. అనసూయ రుణం విషయమై పదిరోజుల క్రితం శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి నిలదీసింది. దీంతో అతడు ఈనెల మూడో తేదీన సిరిసిల్ల ఎస్‌బీహెచ్‌లో రూ.30, రూ.35 చొప్పున డీడీ తీశాడు. ఈ అంకెల పక్కన సున్నాలు చేర్చి రూ.3లక్షలు, రూ.3.50 లక్షలుగా మార్చి అనసూయకు అందించాడు. రుణం మంజూరైందనే ఆశతో అనసూయ ఇంటి నిర్మాణం మెుదలు పెట్టింది.
    డీడీలను విడిపించడానికి సాయంగా రావాలని అనుపురం గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తిని కలువగా.. అవి నకిలీ డీడీలుగా గుర్తించారు. నకిలీ డీడీలను శ్రీనివాస్‌ అనసూయకు అందించిన సమయంలో మరో రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రవి సిరిసిల్ల ఎస్‌బీహెచ్‌ వద్దకు వస్తే డబ్బులు ఇస్తానని అనసూయతో శ్రీనివాస్‌కు ఫోన్‌ చేయించాడు. డబ్బుల ఆశతో శ్రీనివాస్‌ అక్కడికి వచ్చి దొరికిపోయాడు. ఎస్‌బీహెచ్‌ పేరిట నకిలీ డీడీలు అంటగట్టిన విషయమై అనసూయ బ్యాంక్‌ మేనేజర్‌కు తెలుపగా.. ఆయన శ్రీనివాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను చేసింది తప్పేనని ఒప్పుకున్న శ్రీనివాస్‌ డబ్బులు తిరిగివ్వడానికి కొంత గడువు ఇవ్వాలని బాధితురాలని, పోలీసులను ప్రాధేయపపడ్డాడు. 
>
మరిన్ని వార్తలు