జలోత్సవం.. జన సమ్మోహనం

12 Oct, 2016 20:47 IST|Sakshi
జలోత్సవం.. జన సమ్మోహనం
 
రేయితోటకు పూసిన విద్యుత్‌ పూలతో అలంకరించిన రంగురంగుల రాయంచ రథం.. దానిపై చిరునవ్వులు చిందిస్తూ ఆదిదంపతులు ఆశీనులై అలల దారులపై అలాఅలా విహరిస్తుంటే.. ఒడ్డున ఉన్న జనమే కాదు.. జలమూ పులకించిపోయింది. జగదానందకారకమైన ఈ మహోత్సవాన్ని చూసి జాబిలి పరవశించిపోగా, నక్షత్రాలు బాణసంచా టపాసులై జయజయధ్వానాలు పలికాయి. ముక్కోటి దేవతలు ముమ్మారు అమ్మను అనుసరించాయి. దసర ఉత్సవాల్లో చివరి ఘట్టమైన తెప్పోత్సవం మంగళవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. 
 
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : విద్యుద్దీపకాంతులతో దైదీప్యమానంగా వెలిగిపోతున్న హంస వాహనంపై మంగళవారం సాయంసంధ్యవేళ గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్లు నదీవిహారం చేశారు. దుర్గాఘాట్‌లో జరిగిన ఈ సంబరానికి అశేష భక్తజనవాహిని హాజరైంది. ప్రకాశం బ్యారేజీ భక్తులతో కిక్కిరిసింది. తొలుత ఉత్సవమూర్తులకు దుర్గాఘాట్‌లో ఈవో సూర్యకుమారి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఘాట్‌లో ఏర్పాటుచేసిన సాంస్కృతిక ప్రదర్శనలు భక్తిభావాన్ని చాటాయి. డాక్టర్‌ పాలపర్తి శ్యామలానందప్రసాద్, దూళిపాళ్ల రామకృష్ణ వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పుష్కరాల నేపథ్యంలో దుర్గాఘాట్‌ను అభివృద్ధి చేయడంతో ఈ ఏడాది ఎక్కువ మంది భక్తులు ఘాట్‌కు చేరుకుని తెప్పోత్సవాన్ని తిలకించారు. అయితే, కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ వైపునకు అనుమతించకపోవడంతో ఘాట్‌ వెలవెలబోయింది. 
కనులపండువగా ఊరేగింపు
తొలుత ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరాలయం నుంచి గంగా పార్వతులతో పాటు మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను పల్లకీపై ఊరేగింపుగా దుర్గాఘాట్‌కు తీసుకొచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, పంచ వాయిద్యాలు, కేరళ వాయిద్యాలు, కోలాటకాలతో ఊరేగింపు కనులపండువగా సాగింది. కలెక్టర్‌ బాబు.ఏ, సీపీ గౌతమ్‌ సవాంగ్, ఎంపీ కేశినేని నాని, జెడ్పీ చైర్‌పర్సన్‌ గద్దె అనూరాధ, పలువురు పోలీసు అధికారులతో పాటు దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. నదీ విహారం అనంతరం ఉత్సవమూర్తులను బ్రాహ్మణ వీధిలోని జమ్మిచెట్టు వద్దకు తరలించారు. వన్‌టౌన్‌ పీఎస్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు దంపతులు శమీపూజ నిర్వహించారు.
 
 
 
మరిన్ని వార్తలు