డ్వామాలో రాజేంద్రుడి లీలలు

22 Aug, 2016 22:29 IST|Sakshi
డ్వామాలో రాజేంద్రుడి లీలలు
  • ఒక్కొక్కరి వద్దనుంచి రూ. 20 వేల వరకు వసూలు
  • పదోన్నతుల్లోనూ చక్రం తిప్పిన హెచ్‌ఆర్‌ మేనేజర్‌
  • మెదక్‌ జిల్లాకు బదిలీ చేసిన అధికారులు
  • జిల్లా నీటి యాజమాన్య సంస్థ కార్యాలయంలో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. శాఖలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పని చేసిన వ్యక్తి దీనికి సూత్రధారిగా తేలింది. ఆయన సస్పెండ్‌ అయిన టెక్నికల్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్ల వద్దనుంచి డబ్బులు తీసుకుని, తిరిగి విధుల్లోకి తీసుకునేవారని ఆరోపణలున్నాయి. కలెక్టర్‌ ఆదేశాల మేరకు అధికారులు అతడిని మెదక్‌ జిల్లాకు బదిలీ చేశారు. 
     
    ఇందూరు : 
    జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) కార్యాలయంలో అవినీతి జరుగుతోందని కలెక్టర్‌ యోగితారాణాకు ఫిర్యాదులు వచ్చాయి. సంస్థలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేసిన రాజేందర్‌రెడ్డి.. సస్పెండ్‌ అయిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్ల వద్దనుంచి డబ్బులు తీసుకుని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. గత నెలలో డ్వామా పీడీతో పాటు ఉద్యోగుల నిర్వాకంపై ఎంపీడీవోలు జిల్లా కేంద్రానికి వచ్చి కలెక్టర్‌తో మొర పెట్టుకున్నారు. దీంతో కలెక్టర్‌ అప్పటి ఏజేసీ రాజారాంతో ఒక కమిటీని వేసి డ్వామాలో అవినీతి వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆదేశించారు. ఆయన విచారణలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌ రాజేందర్‌రెడ్డి అవినీతి వెలుగులోకి వచ్చింది. ఉపాధిహామీ పథకంలో పనితీరు సరిగా లేకపోవడంతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేస్తే.. వారి వద్దనుంచి హెచ్‌ఆర్‌ మేనేజర్‌ డబ్బులు తీసుకుని సస్పెన్షన్‌ ఎత్తివేయించినట్లు తేలింది. ఇలా ఒక్కో ఉద్యోగినుంచి రూ. 20 వేల వరకు వసూలు చేశాడని సమాచారం. ఈ విషయాన్ని టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు ఏజేసీ కమిటీతో చెప్పారు. రెండేళ్లుగా ఆయన అక్రమాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. పనితీరు బాగాలేని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్లకు నోటీసులు ఇప్పిస్తానని బెదిరించి కూడా డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. విచారణ నివేదికను పరిశీలించిన కలెక్టర్‌.. డ్వామా పీడీ వెంకటేశ్వర్లును తన కార్యాలయానికి పిలిపించి ‘మీ కార్యాలయంలో అవినీతి జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు’ అంటూ మందలించినట్లు సమాచారం. రాజేందర్‌రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో డ్వామా ఉన్నతాధికారులు స్పందించి రాజేందర్‌రెడ్డిని మెదక్‌ జిల్లా సంగారెడ్డికి బదిలీ చేశారు. ఆయన శుక్రవారం రిలీవ్‌ అయ్యారు. 
    గంగాధర్‌పైనా చర్యలకు అవకాశం!
    డ్వామా కార్యాలయంలో ప్లాంటేషన్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న గంగాధర్‌పైనా అవినీతి ఆరోపణలున్నాయి. ఆయన ఎంపీడీవోల వాహనాల బిల్లులు చూస్తారు. ఎంపీడీవోల వాహనాల బిల్లుల మంజూరు పేరిట డబ్బుల వసూళ్లకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. జక్రాన్‌పల్లి ఎంపీడీవోగా గతంలో పని చేసిన సాయన్న.. గంగాధర్‌ వాయిస్‌ను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి కలెక్టర్‌కు వినిపించారు. ఈ విషయంపైనా విచారణ చేపట్టిన అధికారులు.. త్వరలోనే శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. హరితహారం సెక్షన్‌ కూడా ఈ ఉద్యోగే చూస్తున్నారు. ఈయన నర్సరీల నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
    ఆరోపణలు వాస్తవమే :  వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ
    కార్యాలయంలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పని చేసిన రాజేందర్‌ రెడ్డిపై డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన మాట వాస్తవమే. ఇందుకు కలెక్టర్‌ విచారణ చేయించారు. రాజేందర్‌ రెడ్డిని అందులో భాగంగానే బదిలీ చేశాం. 
>
మరిన్ని వార్తలు