ఇండియన్‌ బ్యాంక్‌ ముందు డ్వాక్రా మహిళల ధర్నా

12 Dec, 2016 14:36 IST|Sakshi
ఇండియన్‌ బ్యాంక్‌ ముందు డ్వాక్రా మహిళల ధర్నా

 


గొల్లపల్లి(నూజివీడురూరల్‌) : బ్యాంకర్ల వైఖరిని నిరసిస్తూ డ్వాక్రా మహిళలు గురువారం గొల్లపల్లిలోని ఇండియన్‌ బ్యాంక్‌ ముందు ధర్నాకు దిగారు. బ్యాంక్‌ గేట్లను మూసేసి సిబ్బందిని కార్యాలయంలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. గొల్లపల్లిలోని ఇండియన్‌ బ్యాంక్‌ పరిధిలో గొల్లపల్లి, మీర్జాపురం, మొర్సపూడి, పోలసానిపల్లి, కొత్తపల్లి గ్రామాలున్నాయి. ఏడాదిన్నర కిందట బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేసిన విజయ్‌వర్దన్‌ డ్వాక్రా మహిళల అమాయకత్వాన్ని ఆసరా చేసుకోని 145 డ్వాక్రా గ్రూపుల వారు చెల్లించిన సొమ్మును సొంత ఖాతాకి జమచేసుకున్నారని ఆరోపించారు. రుణాలు మంజూరు చేయకుండానే ఇచ్చినట్లు చూపించి బలవంతంగా కట్టించారు. ఈ విషయాన్ని బ్యాంక్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా విచారించి రూ.కోటీ 74 లక్షలు స్వాహా అయినట్లు నిర్దారించారన్నారు. ప్రస్తుతం మేనేజర్‌ నాగిరెడ్డి సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ధర్నా విరమించేది లేదని మహిళలు భీష్మించుకున్నారు. సీపీఎం మండల కార్యదర్శి సీహెచ్‌ రామారావు డ్వాక్రా మహిళల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఇండియన్‌ బ్యాంక్‌ జోనల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు గొల్లపల్లి విచ్చేసి ధర్నా చేస్తున్న వారితో చర్చలు జరిపారు. ఈనెల 20వ తేదీలోగా డ్వాక్రా మహిళల సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి గ్రూపునకు నూతనంగా రుణాలు మంజూరు చేస్తామని తెలపడంతో శాంతించారు. అప్పటి వరకు చెట్ల నీడలో కూర్చున్న సిబ్బంది బ్యాంక్‌ లోపలికి వెళ్లారు. సీపీఎం నాయకులు ఎన్‌ నరసింహారావు, డి.రవి తదితరులు పాల్గొన్నారు.

08ఎన్‌జడ్‌డి202 : గొల్లపల్లిలో ఇండియన్‌ బ్యాంక్‌ ముందు ధర్నా చేస్తున్న మహిళలు

మరిన్ని వార్తలు