మూడు ముక్కలాట!

3 Mar, 2017 22:35 IST|Sakshi
మూడు ముక్కలాట!

పెట్టుబడి నిధిని ఫలహారం చేసిన తెలుగుదేశం ప్రభుత్వం
మూడేళ్లలో రెండు పేర్లతో హడావుడి
రెండుసార్లు రూ.మూడు వేల వంతున పంపిణీ
ఆ మొత్తం వడ్డీకే సరి అంటున్న మహిళలు
సర్కారు మాయపై మండిపాటు


సాక్షి, అమరావతిబ్యూరో : రుణమాఫీ విషయంలో డ్వాక్రా మహిళలను రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఒక ‘పథకం’ ప్రకారం మోసం చేస్తూనే ఉంది. ఎన్నికల సమయంలో 2014లో రుణాలన్నీ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ... అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చింది. మహిళలను ఏమార్చేందుకు 2015లో ‘పెట్టుబడి’ నిధిని తెరపైకి తీసుకొచ్చింది. ఆ పథకం ప్రకారం ఒక్కో సభ్యురాలికి ఇచ్చిన రూ.3వేలను బ్యాంకులు వడ్డీల కింద జమ చేసుకున్నాయి. మహిళల అసంతృప్తిని గమనించిన సర్కారు 2016లో ‘పసుపు–కుంకుమ’ను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కూడా రూ.3వేలు చొప్పున బ్యాంకుల్లో జమ చేసింది. ఈ ఆరు వేల రూపాయల్లో పైసా కూడా మహిళల చేతికి చేరడంలేదు. వడ్డీల కింద బ్యాంకులే జమ చేసుకుంటున్నాయి. మహిళలకు అసలు వెతలు మాత్రం తీరడం లేదు.

ఇదీ కృష్ణా జిల్లాలో పరిస్థితి...
కృష్ణా జిల్లాలో మొత్తం 58,267 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో 5,94,505 మంది సభ్యులు ఉన్నారు. వారికి 2015లో తొలి విడతగా ‘పెట్టుబడి నిధి’ ద్వారా ప్రభుత్వం రూ.170.85 కోట్లు మంజూరు చేసింది. రెండో విడతగా 2016లో ‘పసుపు కుంకుమ’ ద్వారా కొన్ని సంఘాలకు మాత్రమే నిధులు అందాయి. మరికొన్ని సంఘాల సభ్యులు బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 11,500 గ్రూపులకు చెందిన 1,15,000 మంది సభ్యులకు రెండు విడతలుగా నగదు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో మెప్మా పరిధిలో 8,700 స్వయం సహాయ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో 89,350 మంది సభ్యులు ఉన్నారు. వీటిలో 7,667 గ్రూపులకు చెందిన 76,988 మంది మహిళలకు ఒక్కో విడతలో రూ.23.9 కోట్లు చొప్పున మంజూరైనట్లు అధికారులు తెలిపారు.

విజయవాడలో అక్రమాలు..
‘పసుపు–కుంకుమ’ సొమ్ము మం జూరు విషయంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అమక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు సోషల్‌ వర్కర్లు, ప్రాజెక్టు అధికారితో కలిసి ఆ నిధులు పక్కదారి పట్టించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలోని 29వ డివిజన్‌లో 41 స్వయం సహాయక సంఘాలకు నిధులు ఇంతవరకు పంపిణీ చేయలేదని మహిళలు మేయర్‌కు ఫిర్యాదు చేశారు. పలుమార్లు ప్రాజెక్టు అధికారి సత్యనారాయణకు ఫిర్యాదు చేసినా, ఆయన స్పందించలేదని బాధిత మహిళలు చెబుతున్నారు.  

సర్కారు మాయాజాలం...
ఎన్నికల సమయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నమ్మి రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు బ్యాంకులకు రుణాలు చెల్లించడం నిలిపివేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సర్కారు డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. దీంతో వడ్డీలు పెరిగిపోయి మహిళలు ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగింది. దీంతో మహిళలను మభ్యపెట్టేందుకు సర్కారు 2015లో ‘పెట్టుబడి నిధి’ పేరుతో ఒక పథకాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద ఒక్కో మహిళకు రూ.10వేలు ఇస్తామని ప్రకటించింది. అయితే 2014, మార్చి 30వ తేదీకి ముందు ఉన్న గ్రూపులకు ఈ మొత్తం మంజూరు చేస్తామని చెప్పింది.

తొలి విడతగా ఒక్కో సభ్యురాలి బ్యాంక్‌ ఖాతాలో కేవలం రూ.3వేలు మాత్రమే జమ చేసి చేతులు దులిపేసుకుంది. తమను సర్కారు మోసం చేసిందని డ్వాక్రా మహిళలు గుర్తించడంతో 2016లో ‘పసుపు–కుంకుమ’ పేరుతో మరో రూ.3వేలు ఇచ్చింది. ఈ మొత్తం వడ్డీల కింద బ్యాంకులు జమ చేసుకున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రుణమాఫీ చేయకపోయినా... కనీసం పెట్టుబడి నిధి పేరుతో చెప్పిన రూ.10లు కూడా ఇవ్వకపోవడం ప్రభుత్వ మోసపూరిత విధానాలకు నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు