నిమ్మ రైతులకు శుభవార్త

26 Aug, 2016 21:20 IST|Sakshi
నిమ్మ రైతులకు శుభవార్త
  • త్వరలో పొదలకూరు యార్డులో ఈ – మార్కెట్‌ ఏర్పాటు 
  • దేశ మార్కెట్‌ను అనుసరించి ధరల ప్రదర్శన
  • నిమ్మ రైతులు నష్టపోకుండా కేంద్రం చర్యలు 
  • పొదలకూరు: స్థానిక ప్రభుత్వ  నిమ్మ మార్కెట్‌ యార్డులో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ–మార్కెట్‌ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు యార్డులో బయ్యర్లు, సేల్స్‌ అనే రెండు విధాల్లో వ్యాపారం నిర్వహిస్తున్నారు. బయ్యర్లకు రైతులు నేరుగా కాయలను తోలితే వారు ఢిల్లీ మార్కెట్‌ను అనుసరించి ధరలను అందజేస్తుంటారు. అలాగే సేల్స్‌ వ్యాపారులు రైతుల పంపించే కాయలను వేలంపాట ద్వారా బయ్యర్లకు అమ్ముతుంటారు. ఇందుగాను రైతుల నుంచి కమిషన్‌ వసూలు చేస్తారు. ఈ వ్యవహారం రైతు, వ్యాపారుల మధ్య ఉన్న సత్సంబంధాలు, నమ్మకంపై జరిగిపోతుంది. కాయలను మార్కెట్‌కు తోలే రైతులు దుకాణానికి రాకుండానే వ్యాపారులు ధరలను నిర్ణయిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ మార్కెట్లలో రైతులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు ధరల విషయంలో నష్టపోకుండా చూసేందుకు ఈ–మార్కెటింగ్‌ను తీసుకువచ్చింది. దేశంలోని  21 మార్కెట్‌ యార్డ్‌లలో ఈ–మార్కెటింగ్‌ విధానాన్ని పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద అమలు చేసింది. ఈ ప్రాజెక్ట్‌ విజయవంతం కావడంతో రాష్ట్రాలతో సంప్రదించి  దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రెండో విడతగా దేశంలోని 200 మార్కెట్‌ యార్డ్‌లలో ఈ–మార్కెట్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో ఈ–మార్కెట్‌ సౌకర్యాన్ని ప్రవేశపెడుతుండగా అందులో పొదలకూరు నిమ్మమార్కెట్‌ యార్డు ఉండడం విశేషం. ఇందుకోసం యార్డును అసిస్టెంట్‌ అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ అడ్వైయిజర్‌(కేంద్ర ప్రభుత్వ అధికారి) ఎం జవహర్‌  పరిశీలించారు. సెప్టంబరు చివరి నాటికి యార్డులో ఈ–ట్రేడింగ్‌ ద్వారా నిమ్మకాయలను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు.
    ఈ–మార్కెట్‌ సౌకర్యాలు 
    ఈ–మార్కెట్‌ విధానంలో రైతు తన మొబైల్‌ నుంచే కాయల ధరలను పరిశీలించేందుకు వీలుకలుగుతుంది. దేశ మార్కెట్‌ను అనుసరించి యార్డ్‌లో నిత్యం ధరలను ప్రదర్శిస్తారు. యార్డుకు వచ్చే కాయల వివరాలను ముందుగా వ్యాపారులు ఆన్‌లైన్‌లో ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత కాయల ధరలను నిర్ణయిస్తారు. బయటి మార్కెట్, స్థానిక మార్కెట్‌ ధరలను తెలుసుకునేందుకు వీలుకలుగుతుంది. వ్యాపారులు నిర్ణయించిన ధరలతో పనిలేకుండా ఆన్‌లైన్‌లో ధరలను చూసుకుని రైతులు తమ కాయలకు ధర నిర్ణయించుకోవచ్చు. 
     
     ఈ–మార్కెట్‌ ప్రయోజనం: ఎం.శ్రీనివాసులు, మార్కెట్‌ కమిటీ కార్యదర్శి 
     ఈ–మార్కెట్‌తో రైతులకు ప్రయోజనం. పొదలకూరు యార్డులోని రైతుల విశ్రాంతి గదిలో రూ.30లక్షలతో ఈ–మార్కెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. రైతుల విశ్రాంతి గదులను ఈ–మార్కెట్‌ పైన నిర్మిస్తాం.
మరిన్ని వార్తలు