ప్రతి జిల్లాలో పోలీస్‌జిమ్‌

17 Jul, 2016 22:25 IST|Sakshi
ప్రతి జిల్లాలో పోలీస్‌ జిమ్‌


 –రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు వెల్లడి

కడప అర్బన్‌:
పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో జిమ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర డీజీపీ జేవీ రాముడు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పర్యటనకు విచ్చేసి ఆయన కడప నగరంలోని పోలీసు లైన్‌లో పోలీసు జిమ్‌ కేంద్రాన్ని, పోలీసు పెట్రల్‌ బంకును ప్రారంభించారు. అనంతరం  జిమ్‌లోని పరికరాలను పరిశీలించారు. కొద్ది సేపు వ్యాయామం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖలో ఊబకాయులుగా ఉన్నవారి బరువు తగ్గించేందుకు ముందుగా ప్రత్యేక టీంలతో సర్వే చేయించామన్నారు. ఈ జిమ్‌ కేంద్రాల ద్వారా అధిక బరువు ఉన్నవారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, వారికి వ్యాయామ తరగతులను నిర్వహిస్తామన్నారు. పోలీసు శాఖకు సంబంధించిన ఖాళీ స్థలాలను ఎవరూ ఆక్రమించకుండా ఆయా స్థలాల్లో అవసరమైన సంక్షేమ కార్యక్రమాల కోసం నిర్మాణాలను చేపడుతున్నామన్నారు.

నెల్లూరు జిల్లాలో పోలీస్‌ పెట్రోల్‌ బంక్‌ను ఇప్పటికే ప్రారంభించామన్నారు. ప్రస్తుతం కడపలో పెట్రోల్‌ బంక్‌ను ప్రారంభించామన్నారు. తద్వారా మిగతా పెట్రోల్‌ బంక్‌ కన్నా నాణ్యమైన పెట్రోల్‌ను తమ వాహనాలతో పాటు, ఇతర వాహనాలకు అందించగలుగు తామన్నారు. హె పీసీఎల్‌ సంస్థ వారికి ఆదాయంతో పాటు వచ్చే కమీషన్‌ పోలీస్‌ సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుందన్నారు. అలాగే పెట్రోల్‌ బంక్‌ ఆవరణంలో మొక్కను నాటారు.  ఈ కార్యక్రమాల్లో రాయలసీమ ఐజి శ్రీధర్‌రావు, కడప– కర్నూలు రేంజి డిఐజి రమణకుమార్, జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ, ఓఎస్‌డి (ఆపరేషన్స్‌) సత్య ఏసుబాబు, పులివెందుల ఏఎస్‌పి అన్బురాజన్, జిల్లా అదనపు ఎస్పీ విజయకుమార్, డీఎస్పీలు ఈజీ అశోక్‌ కుమార్, పూజిత నీలం, సర్కార్, రాజేంద్ర, నాగేశ్వర్‌ రెడ్డి, భక్తవత్సలం, శ్రీనివాసులు, రాజగోపాల్‌ రెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు సిబ్బంది పాల్గొన్నారు.


 

మరిన్ని వార్తలు