పాతక్షక్షల నేపథ్యంలో ఇరువర్గాల ఘర్షణ

9 Sep, 2017 07:18 IST|Sakshi
దాడిలో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాదితులు లక్ష్మీనారాయణ, విజయరాజు

కత్తులతో పరస్పర దాడి
ఇద్దరికి తీవ్రగాయాలు: జీజీహెచ్‌కు తరలింపు


గుంటూరు రూరల్‌: పాత కక్షల నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి కత్తులతో నరుక్కున్న ఘటన శుక్రవారం మండలంలోని గోరంట్లలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

గోరంట్ల గ్రామంలోని ఓ ఆలయ కమిటీ నిర్వహణపై రెండు వర్గాల మధ్య వివాదం ఉండేది. గురువారం  వినాయక ఉత్సవాల్లో భాగంగా ఒక వర్గం ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనోత్సవానికి రెండో వర్గం వ్యక్తులు వచ్చారని ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో రెండో వర్గానికి చెందిన ఓ వ్యక్తిపై దాడి జరిగింది. దాడిపై రెండో వర్గం వారు శుక్రవారం ఉదయం నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై శుక్రవారం రాత్రి తిరిగి వివాదం రాజుకుంది. గ్రామంలోని రైస్‌మిల్‌ సెంటర్‌లో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు వాదనకు దిగారు. అది కాస్తా ఘర్షణకు దారి తీసి ఒక వర్గానికి చెందిన జుజ్జులూరి లక్ష్మీనారాయణ, జుజ్జులూరి విజయరాజు, వేముల రాణి తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను గ్రామస్తులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఘటనపై మండల నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీస్‌ వాహనం ఎదుటే వివాదం.. ?
గురువారం ఫిర్యాదు చేసిన ఘటనలో విచారణ నిమిత్తం గ్రామానికి వచ్చిన పోలీస్‌ వాహనం ఎదుటే వివాదం జరిగినట్లు సమాచారం. గురువారం దాడిచేసి గాయపరిచినవారిని పట్టించేందుకు పోలీసులతో పాటు సెంటర్‌కు వచ్చిన వ్యక్తులపై ప్రత్యర్థులు పోలీసుల ఎదుటే కత్తులతో దాడిచేసి గాయపరిచారని తెలిసింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటుండగా పోలీసులు చూసీచూడన్నట్లు ఉన్నారని, దీంతోనే దాడిచేసి గాయపరిచిన ఐదుగురు వ్యక్తులు పరారయ్యారని సమాచారం. గురువారం దాడి జరిగిన తర్వాత ఇరువర్గాలను శుక్రవారం ఉదయం స్టేషన్‌కు పిలిపించి విచారించి కేసు నమోదు చేస్తే దాడులు జరిగేవి కాదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.

మరిన్ని వార్తలు