లారీల సమ్మె సడలింపు

7 Apr, 2017 00:11 IST|Sakshi
లారీల సమ్మె సడలింపు
తాడేపల్లిగూడెం : రాష్ట్రంలో లారీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై లారీ యజమానుల సంఘ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలవంతం కావడంతో గురువారం రాత్రి నుంచి లారీలు రోడ్లపైకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలపై ఇంకా పరిష్కారం లభించలేదు. దీంతో పక్క రాష్ట్రాలకు లారీలను నడిపే అవకాశాలు లేకుండా పోయింది. ఈ మేరకు రాష్ట్రంలో లారీలు తిరగవచ్చనే సమాచారాన్ని రాష్ట్ర అసోసియేషన్‌కార్యదర్శి జిల్లాలోని అసోసియేషన్‌ బాధ్యులకు గురువారం సాయంత్రం సమాచారం పంపించారు. దీంతో రహదార్లపైకి లారీలు రావడానికి మార్గం సుగమమైంది. శుక్రవారం నుంచి గురువారం వరకు జిల్లాలో లారీలు తిరగనందువల్ల సుమారు రూ.300 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. జిల్లాలో దాదాపు 5 వేల లారీలు ఉండగా వారం రోజులుగా నిలిచిపోయాయి. వేలాది కుటుంబాలు ఆదాయం లేక విలవిల్లాడాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న పరిశ్రమపై నిరవధిక సమ్మె తీవ్ర ప్రభావం చూపించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొన్ని సమస్యల పరిష్కారానికి మార్గం దొరికిందని గూడెం లారీ అసోసియేషన్‌నాయకుడు గురుజు సూరిబాబు అన్నారు. 
 
 
>
మరిన్ని వార్తలు