తూర్పున హై అలర్ట్‌

27 Jul, 2016 23:43 IST|Sakshi
తూర్పున హై అలర్ట్‌
 
  • నేటి నుంచి మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు
  • టార్గెట్లను అప్రమతం చేసిన పోలీసులు
 
మంథని/మహాముత్తారం : ఉద్యమబాటలో అసువులు బాసిన అమరులను స్మరించుకునేందుకు మావోయిస్టులు ఏటా నిర్వహించే సంస్మరణ వారోత్సవాలు గురువారం నుంచి ఆగస్టు 3 వరకు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు జిల్లా పోలీసులు అలర్ట్‌ అయ్యారు. వారోత్సవాలను భగ్నం చేసేందుకు అటవీ గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బలగాలు అడవులను జల్లెడ పడుతున్నాయి.
పశ్చిమ మావోయిస్టు సిద్దాంతకర్త చార్‌మజూందార్‌ 1977లో మృతిచెందాడు. అప్పటి నుంచి మావోయిస్టులు సంస్మరణ వారోత్సవాలను ఏటా తమకు పట్టున్న ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు.  ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి పెట్టిన కోటాగా ఉన్న మహదేవాపూర్, మహాముత్తారం ప్రాంతాన్ని నక్సల్స్‌ గెరిల్లా జోన్‌గా ప్రకటించుకుని సమాంతర పాలన నడిపారు. కాలక్రమంలో పోలీసులు ఉక్కుపాదం మోపడంతో అగ్రనాయకులు హతమయ్యారు. కొన్నేళ్లు ఈ ప్రాంతాన్ని వీడిన మావోయిస్టులు దండకారణ్యంలో తిష్టివేసి అప్పుడప్పుడు తూర్పున తమ ఉనికిని చాటుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్‌కౌంటర్లు  ఆగుతాయని మావోయిస్టులు భావించారు. ఈ క్రమంలో వరంగల్‌ జిల్లాకు చెందిన శృతి, విద్యాసాగర్‌ను తెలంగాణ పోలీసులు కాల్చి చంపడంతో మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునేందుకు అందును కోసం చూస్తున్నారు. తాజాగా అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించి తూర్పున మళ్లీ ఉనికి చాటుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందడంతో తిప్పి కొట్టడానికి పోలీసులు గోదావారి పరీవాహక ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మావోల టార్గెట్లను, మాజీ నక్సలైట్లను అప్రమత్తం చేసినట్లు మహాముత్తారం ఎస్సై వెంకటేశ్వర్‌రావు తెలిపారు. అయితే కొన్నేళ్లుగా ఉనికి కోల్పోయిన మావోయిస్టు పార్టీ  జిల్లాలో ఎక్కడా సంస్మరణ సభలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఏదేమైనా వారం రోజులు అటవీ గ్రామాల ప్రజలు బిక్కుబిక్కు మంటూ కాలం వెల్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది.  
 
 
మరిన్ని వార్తలు