గుడ్ల ఉత్పత్తిలో ‘తూర్పు’ ప్రథమం

1 Sep, 2016 23:53 IST|Sakshi
గుడ్ల ఉత్పత్తిలో ‘తూర్పు’ ప్రథమం
రాయవరం : గుడ్ల ఉత్పత్తిలో జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోందని పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వి.వెంకటేశ్వరరావు తెలిపారు. రాయవరం పశువైద్యశాల తనిఖీకి గురువారం వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. పాల ఉత్పత్తిలో మన జిల్లా ఐదు, మాంసం ఉత్పత్తిలో ఆరు స్థానాల్లో నిలుస్తోందన్నారు. జిల్లాలో రోజుకు 45 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ఏటా 96.22 లక్షల మెట్రిక్‌ టన్నుల పాలు, 46,816 మెట్రిక్‌ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. తమ శాఖలో వివిధ స్థాయిలకు చెందిన 206 పోస్టులు ఖాళీగా ఉన్నాయని జేడీ వెంకటేశ్వరరావు తెలిపారు. 47 పశు వైద్యాధికారులు, 75 జూనియర్‌ వెటర్నరీ ఆఫీసర్లు, 84 అటెండెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. పశవుల సంఖ్య అధికంగా ఉండే రావులపాలెం, పోలవరం, గన్నవరం, కొత్తలంక తదితరచోట్ల పశువైద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. త్వరలో భర్తీ అయ్యే 300 పశు వైద్యాధికారి పోస్టుల్లో జిల్లాకు 30 వస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 19లోగా 3.77 లక్షల ఆవులకు, 6.43 లక్షల గేదెలకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయడం లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా జియోట్యాగింగ్‌ విధానంలో ఈ టీకాల కార్యక్రమం జరుగుతోందన్నారు. మనకోడి పథకంలో గత ఏడాది 475 యూనిట్లు అందజేయగా, ఈ ఏడాది 745 యూనిట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. విలేకర్ల సమావేశంలో ఏడీ డాక్టర్‌ ఎం.రామకోటేశ్వరరావు ఉన్నారు.
మరిన్ని వార్తలు