ఈసీవాగు వెలవెల

29 Jul, 2016 18:03 IST|Sakshi
ఈసీవాగు వెలవెల

  వానాకాలంలో ఇప్పటి వరకు వాగులో చేరని వరద
⇒  హిమాయత్‌సాగర్‌ సైతం ఎండుముఖం
⇒  పెరగని భూగర్భజలాలు

శంషాబాద్‌ రూరల్‌ : వర్షాకాలంలో వరదతో కళకళలాడాల్సిన ఈసీవాగు నీరు లేక వెలవెలబోతోంది. జంట నగరాలకు తాగునీటిని అందించే జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌లోకి వరదను చేర్చే ఈ ప్రధాన వాగులో ఇప్పటి వరకు చుక్కనీరు పారలేదు. వర్షాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా ఆశించిన వానలు కురవలేదు. జిల్లాలోని వికారాబాద్‌ ప్రాంతంలో మొదలై ఈ వాగు చేవెళ్ల, షాబాద్‌, మొయినాబాద్‌, శంషాబాద్‌ మండలాల పరిసరాల నుంచి హిమాయత్‌సాగర్‌కు చేరుకుంటుంది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిస్తే వాగులో వరద పారుతుంది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ఆశించిన వర్షాలు లేక వాగులో వరద రాలేదు. గత ఏడాది సైతం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత రెండేళ్ల నుంచి వాగులోకి పెద్దగా నీరు పారలేదు. వాగులో వరద పారితే భూగర్భజలాలు పెరిగి సమీప గ్రామాల్లోని బోర్లలో నీరు పుష్కలంగా వస్తాయి. కానీ.. ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాగు పరిసర ప్రాంతాల్లో రైతులు బోర్ల కింద ఎక్కువగా వరి, కూరగాయల పంటలు సాగు చేస్తుంటారు. వర్షాభావ పరిస్థితులతో గతేడాది డిసెంబరు నుంచి బోర్లు ఎండిపోతూ వచ్చాయి. సరైన వర్షాలు లేక భూగర్భజలాలు పెరగక నేటికీ బోర్లు రీచార్జ్‌ కాలేదు. దీంతో వరిసాగుకు తీవ్రఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు హిమాయత్‌సాగర్‌లో నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరుకోవడమే కాకుండా నగరానికి నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. వర్షాకాలంలో నీటితో కళకళలాడి పర్యాటకులను ఆకర్షించే హిమాయత్‌సాగర్‌ నేడు నీరు లేక వట్టిపోతోంది.

మరిన్ని వార్తలు