శివకుమార్ అంటే ఐ‘డర్’

12 Sep, 2016 10:31 IST|Sakshi
శివకుమార్ అంటే ఐ‘డర్’

సాక్షి, సిటీబ్యూరో: చైనా బైక్స్‌ పేరుతో దేశ వ్యాప్తంగా 60 మందికి పైగా టోకరా వేసిన శివకుమార్‌ లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘరానా మోసగాడిని సీసీఎస్‌ పోలీసుల శనివారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. హయత్‌నగర్‌ సమీపంలోని పెద్ద అంబర్‌పేటలో ఉన్న గోడౌన్‌ను సీజ్‌ చేసిన అధికారులు అందులో ఉన్న బైక్స్‌ను స్వాధీనం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క ఈ ఘరానా మోసగాడు అనేక మంది యువతులనూ వంచించినట్లు వెలుగులోకి వచ్చింది.

ఈ కోణంలో తమకు ఫిర్యాదులు రాలేదని, వస్తే నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని సీసీఎస్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఐడర్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి అదే బ్రాండ్‌తో బైక్స్‌ తయారు చేసి విక్రయించాలని శివకుమార్‌ ప్రయత్నాలు చేశాడు. చైనాకు చెందిన ద్విచక్ర వాహనాల తరహాలోనే ఇవీ ఉంటాయని ప్రచారం చేసుకున్నాడు. అయితే ఇలాంటి వాహనాల తయారీకి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. తానే స్వయంగా హైదరాబాద్‌లో కొన్ని వాహనాలు తయారు చేయించి ప్రదర్శించాడు.

మొత్తం 15 మోడల్స్‌లో 110 సీసీ నుంచి 650 సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలు ఉంటాయని, వీటి ధర రూ.49 వేల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుందని నమ్మబలికాడు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక,  తమిళనాడు, గుజరాత్‌ మహరాష్ట్ర, గోవాలతో పాటు దేశ వ్యాప్తంగా 60 మంది నగదు చెల్లించి డీలర్‌షిప్స్‌ తీసుకున్నారు. ఈ నయవంచకుడు కొందరు యువతులకూ ప్రేమ పేరుతో వల వేసి వారినీ వంచించాడు. ఆయా యువతులతో సన్నిహితంగా ఉన్న సమయాల్లో వారికి తెలియకుండా వీడియోలు, ఫొటోలు తీసేవాడు. వీటిని చూపించి ఆ యువతులను బెదిరించే వాడని, అలా తన డీలర్ల వద్దకు వారిని పంపుతూ ఆ దృశ్యాలు చిత్రీకరించే వాడని తెలిసింది.

రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వరకు డిపాజిట్లుగా, మరికొంత మొత్తం బైక్స్‌ కోసం అడ్వాన్స్‌గా చెల్లించే డీలర్లు చివరకు మోసపోయామని తెలుసుకునే వారు. తాము చెల్లించిన నగదు తిరిగి ఇవ్వమంటే ‘దృశ్యాలు’ ఉన్నాయంటూ వారినీ బ్లాక్‌మెయిల్‌ చేసే వాడని తెలుస్తోంది. ఇతడి కార్యాలయంలో సోదాలు చేసిన పోలీసులకు రెండు ఈ తరహాకు చెందిన సీడీలు లభించాయని సమాచారం. పోలీసులు మాత్రం తమకు ఈ వ్యవహారాలపై ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేస్తున్నారు.

ఇతడిపై ఇప్పటికే జూబ్లీహిల్స్, కాచిగూడ, మీర్‌చౌక్, సరూర్‌నగర్‌ ఠాణాల్లో కేసులు నమోదై ఉండగా... తాజాగా సీసీఎస్‌ పోలీసులు నమోదు చేశారు. శివకుమార్‌ మాటలు నమ్మిన అనేక మంది డీలర్లు కొన్ని నెలలుగా షోరూమ్స్, కార్యాలయాలు, సిబ్బందిని సిద్ధం చేసుకున్నారు. అప్పటి నుంచి వాటి అద్దెలు, వారికి జీతాలు చెల్లిస్తున్నారు. చివరకు ఇప్పుడు మోసపోయామని తెలియడంతో లబోదిబోమంటున్నారు.

మరిన్ని వార్తలు