ఇక కష్టాల ‘వంతు’

21 Oct, 2016 23:36 IST|Sakshi
ఇక కష్టాల ‘వంతు’
– రబీకి సాగునీటి కష్టాలు షరామాములే
– 10 టీఎంసీలకుపైనే లోటు
– సాగు గట్టెక్కాలంటే 77 నుంచి 80 టీఎంసీలు అవసరం
– అందుబాటులో ఉండేది 68 టీఎంసీలే
– 75 శాతం ఆయకట్టుకు మాత్రమే సరిపోతుందంటున్న అధికారులు
– వంతులవారీ విధానం అమలు చేయాలని నిర్ణయం
 
కొవ్వూరు :
ఖరీఫ్‌ వరి కోతలు మొదలయ్యాయి. మాసూళ్లు పూర్తికాగానే.. రబీ నారుమడులు పోసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈసారి కూడా రబీ పంటకు సాగునీటి కష్టాలు తప్పని పరిస్థితి ఏర్పడింది. గోదావరిలో 10 టీఎంసీలకు పైగా నీటి లోటు ఉంటుందని, రబీ గట్టెక్కాలంటే మరో 15 టీఎంసీల వరకు నీరు అవసరమవుతుందని జల వనరుల శాఖ అంచనా వేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని మూడు డెల్టాలకు పూర్తిస్థాయిలో సాగు నీరు అందించడం కష్టమని అధికారులు తేల్చేశారు. రెండు జిల్లాల్లోని 8.86 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుండగా 75.74 శాతం ఆయకట్టుకు మాత్రమే సాగునీరు అందుబాటులో ఉంటుందని లెక్కగట్టారు. గురువారం కాకినాడలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో ఉభయ గోదావరిలో పూర్తి ఆయకట్టుకు నీరిస్తామని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించారు. అధికారులు ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. మొత్తం ఆయకట్టుకు నీరివ్వాలంటే వంతులవారీ విధానం అమలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
అందుబాటులో 68 టీఎంసీలు
రబీ పంటకు పూర్తిస్థాయిలో నీరందించాలంటే 77 నుంచి 80 టీఎంసీల నీరు అవసరమవుతుంది. అయితే, గోదావరిలో 33 టీఎంసీలు, సీలేరు ద్వారా 35 టీఎంసీలు కలిపి మొత్తంగా 68 టీఎంసీలు అందుబాటులోకి వస్తుందని లెక్కగట్టారు. సాగు అవసరాలు తీరాలంటే మరో 15 టీఎంసీలు అవసరం అవుతుందని చెబుతున్నారు. మురుగు కాలువలకు అడ్డుకట్టలు వేయడం, ఆయిల్‌ ఇంజిన్ల వినియోగించడం ద్వారా మరికొంత నీటిని అందుబాటులోకి తెచ్చినా మరో 10 టీఎంసీలకు పైగా లోటు ఉంటుందని చెబుతున్నారు. ఈ దష్ట్యా వంతులవారీ విధానం, నీటి పొదుపు చర్యలు పాటించడం ద్వారా పంటల్ని గట్టెక్కించాలని నిర్ణయించారు. ఈ పరిస్థితుల వల్ల శివారు ప్రాంత రైతులు ఈ ఏడాది రబీలోనూ సాగునీటికి కటకటలాడక తప్పని పరిస్థితి ఉంది. 
 
పొదుపు ^è ర్యలు పాటిస్తాం
ఉభయ గోదావరి డెల్టా ఆయకట్టు అంతటికీ నీరందించడానికి సుమారు కనీసం 76 టీఎంసీల నీరు అవసరం. అందుబాటులో ఉన్న నీరు 75 శాతం ఆయకట్టుకు మాత్రమే సరిపోతుంది. నీటి పొదుపు చర్యల ద్వారా కొరతను అధిగమిస్తాం. ఆయిల్‌ ఇంజిన్ల వినియోగం, వంతులవారీ విధానం అమలు, మురుగు కాలువలకు అడ్డుకట్టలు వేయడం వంటి చర్యలు చేపడతాం. నీటి వినియోగం విషయంలో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచుతాం.
– పి.రాంబాబు, ఎస్‌ఈ, గోదావరి హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం 
 
>
మరిన్ని వార్తలు