మరో అవకాశం ఇవ్వండి!

22 Jul, 2016 06:01 IST|Sakshi
మరో అవకాశం ఇవ్వండి!

‘లైవ్’ వేలి ముద్రలకు ముగిసిన గడువు
నమోదు చేసుకోని 4,584 మంది పింఛన్‌దారులు
ఎందుకు వేలి ముద్రలు ఇవ్వలేదో సంజాయిషీ ఇస్తే పింఛన్ మంజూరు

 ఇందూరు : పట్టణ ప్రాంతాల్లోని పింఛన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం ‘లైవ్ ఎవిడెన్స్ సర్టిఫికెట్’కు ఇచ్చిన గడువు బుధవారంతో ముగిసింది. జూన్ 1వ తేదీ నుంచి జూలై 20 వరకు మొత్తం 55 రోజులు గడువు  విధించి, ఈలోగా వేలి ముద్రలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ పట్టణ ప్రాంతాల్లో కలిపి 42,940 మంది పింఛన్‌దారులు ఉండగా, 38,356 మంది తమ వేలి ముద్రలు మీ-సేవా కేంద్రాల్లో నమోదు చేసుకున్నారు. ఇంకా 4,584 మంది నమోదు చేసుకోలేదు. 88.49 శాతం మంది వేలి ముద్రలు నమోదు చేసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

ఆర్మూర్ మున్సిపాలిటీలో 6,096 మంది పెన్షనర్లకు 5,651 మంది నమోదు చేసుకోగా.. 445మంది నమోదు చేసుకోలేదు. బోధన్‌లో 7,428 మందికి 6,575 మంది నమోదు చేసుకోగా, 853 మంది నమోదు చేసుకోలేదు. కామారెడ్డిలో 8,018 మందికి 7,154 మంది నమోదు చేసుకోగా, 864 మంది నమోదు చేసుకోలేదు. అలాగే నిజామాబాద్ మున్సిపాలిటీలో 21,398 మందికి 18,976 మంది నమోదు చేసుకోగా.. 2,422 మంది నమోదు చేసుకోలేదని అధికారులు గుర్తించారు. అయితే అత్యధికంగా నిజామాబాద్ మున్సిపాలిటీలోనే పెన్షనర్లు తమ వేలి ముద్రలు నమోదు చేసుకోకపోవడం గమనించాల్సిన విషయం.

కారణాలు అనేకం
అధికారులు 55 రోజుల సమయమిచ్చి వేలి ముద్రలు నమోదు చేసుకోవాలని సూచించారు. మొదట్లో పెన్షన్‌దారులు గంటల తరబడి మీ-సేవా కేంద్రాల వద్ద క్యూ కట్టారు. కొన్ని రోజుల తరువాత వారి తాకిడి తగ్గుతూ వచ్చింది. రోజుకు 20 మంది చొప్పున నమోదు జరిగింది. అయితే చాలామంది పెన్షన్‌దారులు తమ వేలి ముద్రలు ఇవ్వకపోవడంతో అధికారులు పత్రికా ప్రకటనలు, ఇతర ప్రచార మార్గాల ద్వారా, మున్సిపల్ కమిషనర్‌లకు తెలియజేశారు. వేలి ముద్రలు నమోదు చేసుకోవాలని సూచించారు. కానీ.. చాలా మంది విషయం తెలియకో.. తెలిసినా కూడా రాకపోవడం..వంటి కారణాలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా.. ఇందులో చనిపోయిన వారు, దొంగ పెన్షనర్లు కూడా ఉండచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్‌దారులకు మరో అవకాశం కల్పించింది. ఎందుకు వేలి ముద్రలు నమోదు చేసుకోలేదో కారణాలు తెలుపుతూ సంబంధిత బిల్ కలెక్టర్‌లకు దరఖాస్తుకుంటే పింఛన్ పొందవ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గడువు పెంచే అవకాశం లేని తరుణంలో సంజాయిషి ఇవ్వని పెన్షన్‌దారుల పెన్షన్‌లన్నింటినీ త్వరలోనే తొలగించే ఆస్కారం ఉంది. ఇదిలా ఉండగా వేలి ముద్రలు నమోదు చేసుకోని కొంత మంది పెన్షన్‌దారులు ప్రభుత్వం మరికొన్ని రోజులు సమయం ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు. పింఛన్ ఏపీవో రవీందర్‌ను సంప్రదించగా..  గడువు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం మరో సారి గడువుకు ఆదేశాలిస్తే తప్పా ఏమీ చేయలేమని, అయితే బిల్ కలెక్టర్‌లకు తాము వేలి ముద్రలు ఎందుకు నమోదు చేసుకోలేదో పెన్షన్‌దారులు స్వయంగా వెళ్లి దరఖాస్తు పెట్టుకుని సమాధానం చెప్పి పింఛన్ పొందవచ్చని తెలిపారు.

మరిన్ని వార్తలు