ఎన్నికలంటే భయమా.. అలుసా

28 Feb, 2017 23:17 IST|Sakshi

ఐదేళ్లుగా ఎన్నికలకు నోచుకోని జీవీఎంసీ
వంద రోజుల్లో నిర్వహిస్తామని సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు హామీ
మూడేళ్లవుతున్నా ఆ ఊసే ఎత్తని టీడీపీ సర్కారు
 కోర్టు కేసుల సాకుతో కాలక్షేపం
ప్రజావ్యతిరేకతకు భయపడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ ఆరోపణ
జాప్యానికి నిరసనగా జీవీఎంసీ ఎదుట మహాధర్నా
తక్షణమే ఎన్నికలు జరపాలంటూ జీవీఎంసీ కమిషనర్‌కు వినతిపత్రం


ద్వారకానగర్‌(విశాఖ దక్షిణం): పాలకవర్గ పదవీకాలం ముగిసి.. ఐదేళ్లు గడిచినా మహావిశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణమని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు దుయ్యబట్టారు. ప్రజావ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో ఓడిపోతామన్న భయమా లేక అలుసా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సీఎం చంద్రబాబుకు దమ్ముంటే తక్షణమే జీవీఎంసీ ఎన్నికలు నిర్వహించాలని సవాల్‌ చేశారు. ఎన్నికల నిర్వహణలో జాప్యానికి నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గాంధీపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ పాలకవర్గం లేని కౌన్సిల్‌నుంచి పర్సంటేజీల రూపంలో వందల కోట్లు దండుకోవడానికే నగరంలోని టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్నికలు జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి గంటా శ్రీనివాసరావు వేల కోట్లు దోచుకుంటున్నారని  సాటి మంత్రే  చెబుతున్నారని గుర్తు చేశారు. కాగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మంత్రి అయ్యన్నలు విశాఖ నగరాన్ని గంజాయి, తదితర మత్తు పదార్థాలతో నింపేస్తున్నారని స్వయంగా గంటా ఆరోపించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇద్దరు మంత్రులపై చర్యలు తీసుకుంటే పార్టీ పరువుపోతుందని బాబు భయపడుతున్నారన్నారు. జీవీఎంసీ ఎన్నికలు జరిగితే వైఎస్‌ఆర్‌సీపీ గెలుస్తుందన్న భయంతోనే చంద్రబాబు వెనుకడుగు వేస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ వంటివాటి కోసం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతుంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు అవి రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు.

ఎన్నికల హామీనే విస్మరించారు:వంశీకృష్ణ
తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త  వంశీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ 2012 మేలో జీవీఎంసీ పాలకమండలి కాలపరిమితి ముగిసిందని, ఐదేళ్లు గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా తాత్పారం చేస్తోందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన చంద్రబాబు.. మూడేళ్లవుతున్నా ఆ ఊసు ఎత్తడంలేదన్నారు. దీనికి కోర్టు కేసులను సాకుగా చూపుతున్నారని విమర్శించారు. పశ్చిమ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్‌ మాట్లాడుతూ టీడీపీకి చెందిన వారే ఎన్నికలను అడ్డుకునేందుకు కోర్టులో కేసు వేశారన్నారు. ఎన్నికైన పాలకవర్గం ఉంటేనే సమగ్ర అభివృద్ధి జరుగుతుందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుబారా ఖర్చుల వల్ల జీవీఎంసీ రూ.450 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని అన్నారు. గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, దక్షిణ సమన్వయకర్త కోలా గురువులు మాట్లాడుతూ పాలకమండలి లేకపోవడంతో నగరంలో అనేక సమస్యలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కమిషనర్‌కు వినతి
ధర్నా అనంతరం తక్షణమే జీవీఎంసీ ఎన్నికలు జరపాలని కోరుతూ కమిషనర్‌ హరినారాయణన్‌ను కలిసి నేతలు వినతిపత్రం అందజేశారు. మహాధర్నాలో పెందుర్తి సమన్వయకర్త అదీప్‌రాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కంపా హనోక్, రొంగలి జగన్నాథం, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి జి.రవిరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఫరూఖీ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ సత్తి రామకృష్ణరెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పీలా వెంకటలక్ష్మి,  రాష్ట్ర ఎస్సీ సెల్‌  కార్యదర్శి రాజబాబు, జాయింట్‌ సెక్రటరీ రాజు,  నగర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు  బోని శివరామకృష్ణ, ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు బద్రీనాధ్, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు బి.రాధ, నగర సేవాదళ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌గౌడ్, నగర ప్రచార కమిటీ అధ్యక్షుడు బర్కత్‌ ఆలీ, నగర మైనార్టీ కమిటీ అధ్యక్షుడు ఎండీ షరీఫ్,  స్టీల్‌ప్లాంట్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షడు డి.వి.రమణారెడ్డి, కార్యదర్శి మస్తానప్ప, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి బి.కాంతారావు, మాజీ కార్పొరేటర్లు నడింపిల్లి కృష్ణంరాజు, పేర్ల విజయచందర్, గరికిన గౌరి, పామేటి బాబ్జీ, జి.వి.రమణి, పల్లా చిన్నతల్లి, మొల్లి అప్పారావు, పలు వార్డుల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు