ఎలక్షన్‌... మంత్రులకు టెన్షన్‌

11 Aug, 2017 23:42 IST|Sakshi
ఎలక్షన్‌... మంత్రులకు టెన్షన్‌

అంటీముట్టనట్టుగా మంత్రి యనమల
చిన రాజప్పకు పరీక్ష


సాక్షి ప్రతినిధి, కాకినాడ :   కార్పొరేషన్‌ ఎన్నికలు టీడీపీ కీలక నేతలకు కఠిన పరీక్షగా మారాయి. ఓ వైపు ప్రభుత్వ వ్యతిరేకత.. మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం.. చంద్రబాబు అంటే మండిపడుతున్న కీలక సామాజికవర్గాలు.. అభివృద్ధికి నోచుకోని కాకినాడ స్మార్ట్‌సిటీ.. ఇలా అన్ని వైపులా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో హఠాత్తుగా వచ్చి పడిన కాకినాడ కార్పోరేషన్‌ ఎన్నికలు అధికారపార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి. ఇక జిల్లాకు చెందిన మంత్రులకైతే అగ్నిపరీక్షే. ప్రజావ్యతిరేకతను ఎదురొడ్డి కాకినాడ కార్పోరేషన్‌లో పార్టీని విజయతీరాలకు చేర్చడంపై మంత్రులు ముల్లగుల్లాలు పడుతున్నారు.  

ఆమడ దూరంలో యనమల
 ఇటు పార్టీలోను.. అటు మంత్రివర్గంలో సీనియర్‌గా ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణడు కార్పోరేషన్‌ ఎన్నికలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆయనెప్పుడూ  ఇదే పంధాను అనుసరిస్తుంటారు. కాని గత కొంతకాలంగా జిల్లాలో తనమాట చెల్లుబాటు కాని పరిస్థితుల్లో పూర్తిగా దూరంగా ఉండే అవకాశముందని టీడీపీ నేతలంటున్నారు. జెడ్పీ చైర్మన్‌ విషయంలో ఆయన మాట చెల్లుబాటు కాలేదు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల మాటకే అదిష్టానం ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందనే వాదనలు ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ ఎన్నికలు రావడం యనమల పాత్ర చర్చ జరుగుతోంది.  అభ్యర్థుల ఎంపిక అంతా సర్వేలు, ఐవీఆర్‌ఎస్‌ విధానంతో ఉంటుందని అధిష్ఠానం తేల్చిచెప్పడం కూడా ఆయన పాత్ర పెద్దగా లేదన్నట్టుగా చేసింది.

రాజప్ప చుట్టూ ఉచ్చు...
  ఇక ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు మాత్రం ఈ ఎన్నిక అగ్నిపరీక్షే. రాజప్ప కార్పొరేషన్‌ను ఆనుకుని ఉన్న పెద్దాపురం అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జెడ్పీ చైర్మన్‌ మార్పు వంటి విషయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల బాధ్యత కూడా పార్టీ ఆయనకే అప్పగించింది. దీంతో గెలిపించాల్సిన బాధ్యత సహజంగా రాజప్ప మీదనే ఉంది. రాజప్పకు సొంత సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విషయంలోను, ఉద్యమాన్ని ఆణిచివేసే విషయంలో రాజప్ప సొంత సామాజికవర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

పైగా ముద్రగడను ప్రతీ విషయంలోనూ టార్గెట్‌ చేస్తూ రాజప్ప మాట్లాడడం ద్వారా కాపువర్గీయులు రాజప్ప పేరు చెబితేనే మండిపడుతున్నారు.  టీడీపీపై ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఆ సామాజికవర్గం ఓట్లను పొందేందుకు కాపు మహిళకు మేయర్‌ పదవి కేటాయిస్తున్నట్టు టీడీపీ ప్రకటించినప్పటికీ పెద్దగా ప్రయోజనం కలగడం లేదు. కేవలం ఎన్నికల లబ్ధికోసమేనని ఆ సామాజికవర్గం నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజప్ప ఆ సామాజికవర్గాన్ని ఎంత వరకు పార్టీ మెప్పించకువస్తారనేది వేచి చూడాల్సిందే. హోమ్‌... ఆర్థిక వంటి కీలక శాఖలకు మంత్రులుగా ఉన్న రాజప్ప, యనమల ఎన్నికల్లో పార్టీని గెలిపించకపోతే రాజకీయంగా అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వస్తోంది.
 

మరిన్ని వార్తలు