ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిద్దాం

9 Feb, 2017 00:53 IST|Sakshi
– రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్‌
– ఎన్నికల నియమావళిని పాటించాలి
– ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దు  
కర్నూలు(అగ్రికల్చర్‌): శాసనమండలి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహిద్దామని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సీహెచ్‌ విజయమోహన్‌  కోరారు.  బుధవారం కలెక్టర్‌ తన చాంబరులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాజకీయ పార్టీల నేతల ప్రవర్తన, సభలు, ఊరేగింపులు, వాహనాల వినియోగం తదితర వాటిని కలెక్టర్‌ వివరించారు.
 
జాతి, కుల, మత ప్రాంతీయ పరమైన విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించరాదని, ఇతర పార్టీలను విమర్శించేటపుడు వాటి గత చరిత్ర, ఇంతకు ముందు పనితీరును మాత్రమే దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ప్రజా జీవితంతో సంబంధం లేని, వ్యక్తిగత దూషణలు చేయరాదని వివరించారు. రాజకీయ ప్రకటనల ద్వారా కుల, మతపరమైన అభ్యర్థనలు చేయరాదని, మసీదులు, చర్చిలు, దేవాలయాలు, ఇతర ప్రార్థన , పవిత్ర స్థలాల్లో ప్రచారం చేయరాదని వివరించారు. ఓటర్లను ప్రలోభ పెట్టడం, బెదిరించడం, ఒకరి స్థానంలో మరొకరిని ఓటరుగా వినియోగించడం, పోలింగ్‌ స్టేషన్‌కు 100 మీటర్ల పరిధిలో ప్రచారం నిర్వహించడం చేయరాదని తెలిపారు. 
 
సభల నిర్వహణ సమాచారం ఇవ్వాలి
సభల నిర్వహణపై స్థానిక పోలీసులకు ముందుగా సమాచారం అందించాలని, తద్వారా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాపిక్‌ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటారని కలెక్టర్‌ స్పష్టం చేశారు. కొత్త పథకాలు ప్రకటించరాదని, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టరాదని తెలిపారు. రహదారుల నిర్మాణం, తాగునీటి వసతులపై హామీలు ఇవ్వరాదన్నారు. ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారితో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్టు టీంలు వేస్తున్నామని, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను కూడా నియమించనున్నట్లు చెప్పారు.
 
 ఎన్నికల నియమావళి అమలును పరిశీలించేందుకు ఒక సాధారణ పరిశీలకుడు, ఒక వ్యయ పరిశీలకుడు జిల్లాకు రానున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ఓటర్లకు నగదు, మద్యం, బహమతులు పంపిణీ చేయడం నేరమన్నారు. అధికార పార్టీ నేతలు ఓట్ల కోసం కొత్త పింఛన్ల, రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్‌సీపీ ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి అధికారుల దృష్టికి తెచ్చారు. పట్టభద్రుల్లో బోగస్‌ ఓటర్లు ఎక్కువగా ఉన్నారని, వీటిని తొలగించాలని  సీపీఎం నేత గౌస్‌దేశాయ్, సీపీఐ నగర కార్యదర్శి రసూల్‌ కోరారు.
 
కర్నూలు ఓటర్లకు పాణ్యంలో పోలింగ్‌ కేంద్రాన్ని కేటాయించడం దారుణమని పేర్కొన్నారు.  తగిన ఆధారాలతో రాతపూర్వకంగా ఇస్తే విచారించి చర్యలు తీసుకుంటామని  కలెక్టర్‌ తెలిపారు. పింఛన్లు, ప్రజా పంపిణీ, ఉపాధి హామీ పనులు యథావిధిగా జరుగుతాయని వివరించారు. డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, బిజేపి ప్రతినిధి నరసింహవర్మ, సామాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి దండుశేషు యాదవ్‌ పాల్గొన్నారు. 
 
>
మరిన్ని వార్తలు