వేయాల్సింది ఒక చోట.. వేసింది మరో చోట

26 Jul, 2016 19:43 IST|Sakshi
వేయాల్సింది ఒక చోట.. వేసింది మరో చోట
సాగర్‌ కుడి కాలువ వెంబడి అక్రమ విద్యుత్‌ లైన్‌
నీటిని అక్రమంగా తోడేందుకు పైపులైన్‌ ఏర్పాటు
 
మాచర్ల : లక్షల రూపాయలు తీసుకొని  నీటిని చౌర్యం చేసేందుకు విద్యుత్‌శాఖాధికారులే అక్రమ విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేయించిన సంఘటన మండలంలోని బ్రహ్మానందపురం సమీపంలోని సాగర్‌ కుడి కాలువ బొయ్యారం ప్రాంతంలో జరిగింది. కొంతమంది సమాచారంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నాగార్జునసాగర్‌ బొయ్యారం ప్రాంతం నుంచి సూరమ్మ చెరువు వరకు ఎప్పుడూ లోతుగా ఉన్న సొరంగ ప్రాంతంగా ఉండే కాలువలో పది అడుగుల నీరు నిల్వ ఉంటుంది. మంచినీటికి నీరు విడుదల చేసిన ప్రతిసారీ ఈ ప్రాంతంలో నీటి నిల్వ పెరుగుతుంది. దీనిని ఆధారం చేసుకొని చాలా మంది రైతులు ఆక్రమంగా పైపులైన్‌లు వేసి విద్యుత్‌ కనెక్షన్‌ను ఉపయోగించుకొని నీటిని పొలాలకు పెట్టుకొని పంటలు పండించుకుంటున్నారు. దీనిని ఎవరూ పట్టించుకోకపోవడం లేదు. దీనిని ఆసరా చేసుకున్న మండలంలోని సుబ్బారెడ్డిపాలెంకు చెందిన 15 నుంచి 20 మంది రైతులకు 25/16 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌లు మంజూరయ్యాయి. ఇవన్నీ గ్రామ శివారులోని పొలాల్లో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అయితే బోర్లు పనిచేయక, నీరు లేని గ్రామంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకుంటే తమకు నష్టమని భావించిన కొంతమంది అక్రమాలకు తెరలేపారు. తమ గ్రామంలో కాకుండా గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర్‌ కుడికాలువ పక్కన బొయ్యారం వద్ద విద్యుత్‌ లైన్‌ నిర్మాణం చేసి ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేస్తే కాలువలోకి పైపులైన్‌ వేసి నీటిని ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించాలని విద్యుత్‌శాఖాధికారులతో మంతనాలు జరిపారు. ఇందుకు అంగీకరించిన స్థానిక విద్యుత్‌శాఖకు చెందిన సిబ్బంది అధికారులను ఒప్పించి 15 నుంచి 20 ట్రాన్స్‌ఫార్మర్‌లకు లక్షల రూపాయల ముడుపులు చెల్లిస్తామని కోరినట్లు తెలిసింది. దీనికి అంగీకరించి నిబంధనలకు విరుద్ధంగా గ్రామంలోని పొలాల్లో కాకుండా సాగర్‌ కుడికాలువలో పైపులైన్‌లకు అవసరమైన చోట విద్యుత్‌ కనెక్షన్లు కలిపి అనుమతులు లేకుండా అక్రమంగా 14  స్తంభాలు వేసి కొత్తలైన్‌ ఏర్పాటు చేశారు. సుబ్బారెడ్డిపాలెం గ్రామంలో ఏర్పాటు చేయాల్సిన స్తంభాలను బ్రహ్మానందపుర ం శివారులోని సాగర్‌ కుడికాలువ బొయ్యారం వద్ద ఏర్పాటు చేసి రాత్రికిరాత్రి నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు తెలిసింది. దీంతో పెద్దపెద్ద పైపులను కుడి కాలువలో వేసి అక్రమంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ల ద్వారా నీటిని తోడుకునేందుకు రంగం సిద్ధం చేశారు. కాలువలో అక్రమంగా పైపులేసి జలచౌర్యానికి పాల్పడుతూ చివరి భూములకు నీరు వెళ్లకుండా అక్రమాలు చేస్తున్నా   కెనాల్స్‌ అధికారులు  పట్టించుకోవటం లేదు. దీంతో సందట్లో సడేమియా అన్నట్లు విద్యుత్‌శాఖకు చెందిన కొంతమంది సిబ్బంది, కిందిస్థాయి అధికారులు అక్రమంగా విద్యుత్‌లైన్లను ఏర్పాటు చేసి లక్షల రూపాయల ముడుపులు తీసుకుంటూ స్పందించడం లేదు. అధికార పార్టీ అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు కలుగజేసుకొని నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్‌ లైన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
 విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..
విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లను ఎక్కడ మంజూరైతే అక్కడే ఏర్పాటు చేయాలి. కుడి కాలువ పక్కన విద్యుత్‌ లైన్‌ను ఏర్పాటు చేసి కనెక్షన్‌ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– దినకర్‌బాబు, డీఈ
>
మరిన్ని వార్తలు