దిమ్మదిరిగేలా షాక్

24 Jun, 2016 08:49 IST|Sakshi
దిమ్మదిరిగేలా షాక్

సంగారెడ్డి/మెదక్: విద్యుత్ వినియోగదారుల దిమ్మదిరిగేలా సర్కార్ షాకిచ్చింది. వంద యూనిట్ల లోపు వారి జోలికి వెళ్లకపోయినా ఆపై యూనిట్లు వినియోగించే వారికి చార్జీల మోత మోగించింది. పెరిగిన చార్జీలు వచ్చే నెల నుంచి అమల్లోకి రానున్నాయి. జిల్లాలో గృహ అవసరాలకు సంబంధించి 5.50 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా అందులో వందలోపు యూనిట్లు కాల్చే కనెక్షన్లు లక్ష వరకు మాత్రమే ఉన్నాయి. మిగతా 4.50 లక్షల కనెక్షన్ల వారిపై కోట్లాది రూపాయల అదనపు భారం పడనుంది. ప్రస్తుతం ఒకటినుంచి 100 యూనిట్ల వరకు యూనిట్ ధర రూ.2.60 ఉంది.

101 నుంచి 200 యూనిట్ల వరకు యూనిట్ ధర రూ.3.60లు, 201 నుంచి 500 వరకు యూనిట్‌కు రూ.5.60 చొప్పున వసూలుచేస్తున్నారు. ఇందులో 50యూనిట్లు కాల్చిన ఎస్సీ, ఎస్టీలకు మాత్రం పూర్తి సబ్సిడీ ఇస్తున్నారు. కానీ ఒక బల్బు లేదా ఫ్యాన్ వేసినా నెలకు 100 యూనిట్లు దాటడం ఖాయమని ఎస్సీ, ఎస్టీ వినియోగదారులు పేర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ తమకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చడం లేదంటున్నారు. ప్రతి ఇంట్లో 2నుంచి 3 బల్బులు, టీవీ, రెండు ఫ్యాన్‌లు నడిపించినా నెలకు 150 నుంచి 200యూనిట్ల వరకు కాలుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. దీంతో నెలకు రూ.300 నుంచి రూ. 500 వరకు కరెంట్ బిల్లు చెల్లించాల్సి వస్తుందని ప్రజలు పేర్కొంటున్నారు. పెరిగిన చార్జీలు చెల్లించలేక చీకట్లోనే ఉండే పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు.

  గృహావసరాల విద్యుత్‌ను వందకు పైగా యూనిట్లు వాడే కుటుంబాలు దాదాపు 4.50 లక్షలున్నాయి. వీరంతా తాజా పెంపు భారాన్ని మోయాల్సిందే. జిల్లా ప్రజలపై ప్రతినెలా సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకుపైగా అదనపు ఆర్థిక భారం పడే అవకాశాలున్నాయి. జిల్లాలో 8,450 పరిశ్రమలు ఉన్నాయి. పరిశ్రమలకు సంబంధించి యూనిట్ విద్యుత్ ధరను రూ.6.40 నుంచి రూ.6.70కి పెంచటం జరిగింది. ప్రతినెలా పరిశ్రమల నుంచి రూ.5 కోట్ల వరకు బిల్లులు వసూలవుతాయి. కాగా పెంచిన చార్జీల కారణంగా అదనంగా సుమారు రూ.50 లక్షల నుంచి  కోటి రూపాయల వరకు ఆర్థిక భారం పడనుంది. కోళ్ల పరిశ్రమకు యూనిట్ ధరను రూ.3.60 నుంచి రూ.4కు పెంచారు. చక్కెర పరిశ్రమలకు యూనిట్ ధర రూ.4.90 నుంచి రూ.5.20కు పెరిగింది. దీంతో కోళ్ల, చక్కెర పరిశ్రమలపై అదనపు భారం పడనుంది.

బాదుడు తగదు
ప్రభుత్వం నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడం సంతోషకరమే. అయితే వంద యూనిట్లు పైబడిన వారికి చార్జీలు వడ్డించడం సరికాదు. ప్రతి కుటుంబానికి వంద యూనిట్లు దాటుతుంది. ఈ దశలో భారం అందరిపైనా పడుతుంది.  - డి.మోహనాచారి, ఖాజిపల్లి

 కరెంట్ చార్జీల పెంపు సరికాదు..
ప్రభుత్వం బంగారు తెలంగాణ చేస్తామంటూనే ప్రజలపై కరెంట్ చార్జీల భారం మోపడం సరికాదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న సామాన్య ప్రజలకు ప్రభుత్వం కరెంట్ బిల్లులు పెంచి షాక్ ఇవ్వడం బాధాకరం. - రాములు, బ్రాహ్మణ వీధి, మెదక్

100 యూనిట్లు దాటితే పెంపు భారం...
జిల్లాలో 5.50 లక్షల ఇళ్లకు కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. 100 యూనిట్ల లోపు కాల్చే కనెక్షన్లు లక్ష వరకు ఉంటాయి. వంద యూనిట్లు దాటిన వారిపై పెంపు భారం పడనుంది. పరిశ్రమలకు 7 శాతం చార్జీలు పెరగనున్నాయి.  - సదాశివరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ

మరిన్ని వార్తలు