నెల రోజుల్లో పరిష్కారం చూపిస్తాం

3 Dec, 2016 03:48 IST|Sakshi
నెల రోజుల్లో పరిష్కారం చూపిస్తాం

తెలుగు రాష్ట్రాల విద్యుత్ వివాదంపై షీలాబిడే కమిటీ
 
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య నెలకొన్న వివాదానికి మరో నెల రోజుల్లో పరిష్కారం చూపుతామని షీలాబిడే కమిటీ శుక్రవారం తెలిపింది. ఆస్తులు, ఉద్యోగుల విభజనకు సంబంధించి తుది నివేదికలు ఇవ్వాలని రెండు రాష్ట్రాల విద్యుత్ ఉన్నతాధికారులను కమిటీ ఆదేశించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల అప్పులు, ఉద్యోగుల విభజన సమస్యగా మారింది. రెండు రాష్ట్రాల అధికారులు పరస్పర విరుద్ధ వాదనలు విన్పిస్తూ వస్తున్నారు. ఉద్యోగుల విభజన విషయంలోనూ ఇదే ధోరణి కొనసాగుతోంది.

ఏపీ స్థానికత ఆధారంగా తెలంగాణా విద్యుత్ సంస్థలు 1252 మంది ఉద్యోగులను తొలగించాయి. మరోవైపు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు స్వచ్ఛందంగా రిలీవ్ అయి, తెలంగాణ సంస్థల్లో చేరారు. ఉద్యోగుల ఆస్తుల విభజన కోసం నియమించిన షీలా బిడే కమిటీ అనేక పర్యాయాలు చర్చలు జరిపింది. స్థానికత మార్గదర్శకాలు రూపొందించే ప్రక్రియలో రెండు రాష్ట్రాల అధికారులు ఏకతాటిపైకి రాలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన సమావేశం కొంత సానుకూలంగా ఉన్నట్టు ఇరుపక్షాల అధికారులు చెబుతున్నారు.
 
జనవరిలో నిర్ణయం వెల్లడి
2014 జనవరి ఒకటవ తేదీ నాటికి విద్యుత్ సంస్థల ఆడిట్ బ్యాలెన్‌‌స షీట్స్‌ను పరిగణలోనికి తీసుకోవాలని, దీని ఆధారంగా ఆస్తుల విభజన చేయాలని కమిటీ సూచించింది. రెండు రాష్ట్రాలు వీటిని అందించాలని పేర్కొంది. దీనిపై ఏపీ, తెలంగాణ సమగ్ర వివరాలతో ముసాయిదాలను రూపొందించాలని తెలిపింది. ఉద్యోగుల విభజనకు సంబంధించి డిసెంబర్ 15వ తేదీలోగా వాస్తవ పరిస్థితిని వివరించాలని కోరింది. ఉద్యోగుల విభజన చేపట్టడం వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఆర్థిక పరిస్థితిపై ఏ విధంగా ప్రభావం చూపుతుందనే విషయాన్ని రెండు రాష్ట్రాలు తమ నివేదికల్లో పేర్కొనాలని తెలిపింది.

ఇరు పక్షాలు ఈ నివేదికలపై చర్చించుకుని డిసెంబర్ 30లోగా తమ అభ్యంతరాలు తెలపాలని కమిటీ సూచించింది. వీటన్నింటినీ పరిగణలోనికి తీసుకుని జనవరి మొదటి వారంలో రెండు రాష్ట్రాల అధికారుల సమక్షంలో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని షీలాబిడే కమిటీ పేర్కొంది. కమిటీ సమావేశానికి ఏపీ తరపున ట్రాన్‌‌సకో సీఎండీ విజయానంద్, జేఎండీ దినేష్ పరుచూరి, జెన్‌కో డెరైక్టర్ (ఫైనాన్‌‌స) ఆదినారాయణ తదితరులు హాజరయ్యారు.

>
మరిన్ని వార్తలు