పది వేల మందికి ఉపాధి

12 Nov, 2016 18:26 IST|Sakshi

చిలకలపూడి (మచిలీపట్నం) : ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది 10వేల మంది ఎస్సీ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు లక్ష్యంగా నిర్ణయించటం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎన్‌వీవీ సత్యనారాయణ తెలిపారు. ఆయన కార్యాలయంలో శనివారం విలేకర్లతో మాట్లాడుతూ యువస్ఫూర్తి పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పదో తరగతి విద్యార్హత నుంచే ఉపాధి అవకాశం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు.

జిల్లాలోని ఆయా గ్రామాల్లో ఇద్దరు ఎస్సీ యువకులు, యువతులను సమన్వయకర్తలుగా నియమించామని, ఈ సమన్వయకర్తలు చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వారిచే ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకుంటారన్నారు. ఒక్కొక్క ధరఖాస్తుకు రూ. 25లు చొప్పున సమన్వయకర్తలకు ప్రోత్సాహకంగా అందజేస్తామన్నారు.  కళాశాల ప్రిన్సిపాల్స్‌ విద్యార్థులకు ఉపాధి అవకాశాల కల్పనపై అవగాహన కల్పించాలన్నారు. 

జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్లలలో తమ కార్యాలయ సిబ్బందిని నియమించామని, అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్, విద్యార్థులకు ఈ అవకాశంపై అవగాహన కల్పిస్తారన్నారు. ఆయా మండలాల ఎంపీడీవోలకు కూడా సమన్వయకర్తలను ప్రోత్సాహపరిచి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.  వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తును నమోదు చేసుకోవాలన్నారు. ఈ నెల 20వ తేదీలోగా ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈడీ కోరారు.

మరిన్ని వార్తలు