వ్యవసాయానికి ‘ఉపాధి’

26 May, 2017 22:58 IST|Sakshi
వ్యవసాయానికి ‘ఉపాధి’

ఉపాధిహామీ పథకం ద్వారా వ్యవసాయ అనుబంధ పనులు
రైతులపై తగ్గనున్న భారం
ప్రణాళిక సిద్ధం చేస్తున్న అధికారులు

ఆసిఫాబాద్‌: నిరుపేదలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకాన్ని ఇక నుంచి వ్యవసాయానికి అనుబంధంగా మార్పు చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఉపాధిహామీ పథకం అమలు చేస్తున్నప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా ఉపాధి పనులకు వెళ్తున్నారు. దీంతో వ్యవసాయ కూలీల కొరత ఏర్పడింది.

ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ప్రారంభించినప్పటి నుంచి వ్యవసాయానికి అవసరమున్న కూలీలు లభించడం లేదు. దీంతో ఉపాధి కూలీలను వ్యవసాయ పనుల్లో ఉపయోగించుకునేలా అధికారులు చర్యలు ప్రారంభించారు. వ్యవసాయానికి అనుబంధంగా ఉపాధిహామీని చేరిస్తే కూలీల ఖర్చు తగ్గడంతోపాటు వ్యవసాయానికి ఆర్థికభారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

వ్యవసాయ పనుల్లో  చెక్‌డ్యామ్‌లు నిర్మించడం, కందకాలు తవ్వడం, చెట్లు నరకడం, భూమిని చదును చేయడం వంటి పనులను ఉపాధిహామీలో చేర్చే విధంగా జిల్లా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అసైండ్‌ భూముల్లోని రాళ్లు రప్పలు తొలగించి వ్యవసాయానికి పనికి వచ్చేలా రూపొందించడం, పంట పొలాల్లో ఫారంపాండ్‌లు నిర్మించడం వంటి పనులు చేపట్టనున్నారు. ఉపాధిహామీలో భాగంగా జాబ్‌ కార్డులు వచ్చిన వారికి వంద రోజులు పని కల్పించాలనేది ప్రభుత్వ ఉద్దేశం.

తొలగనున్న కూలీల సమస్య
జిల్లా వ్యాప్తంగా 1,14,988 జాబ్‌ కార్డులు, 2,52,235 మంది కూలీలు పని చేస్తుండగా, కొత్తవారు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ పథకం కింద కూలీలకు రోజుకు రూ.162 చెల్లిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఫారంఫాండ్‌లు, నీటి కుంటలు, కుంటలు, ఇంకుడు గుంతలు, భూమి చదును, హరితహారం కింద మొక్కలు నాటడం లాంటి పనులు చేపడుతున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు రూ.3014.16 లక్షలు ఖర్చు చేశారు. 220 మందికి వంద రోజుల పని కల్పించారు. పని చేసిన వెంటనే (మూడు రోజుల్లోగా) 73.10 శాతం మందికి డబ్బులు చెల్లించారు. జాబ్‌ కార్డున్న ప్రతీ కుటుంబానికి వంద రోజులు పని కల్పిస్తారు. దీంతో వలసలు తగ్గడంతోపాటు రైతులకు ప్రోత్సాహం లభిస్తుంది. జిల్లాలోని ఆసిఫాబాద్, వాంకిడి, కెరమెరితోపాటు అన్ని మండలాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి.

వ్యవసాయానికి అనుబంధంగా ఉపాధిహామీని చేర్చి, దీనిపై కూలీలకు అవగాహన కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధిహామీ కూలీలు వ్యవసాయానికి ఉపయోగపడే పనులు చేయడం లేదు. ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించుకుంటున్నారు.

దీంతో గ్రామాల్లో కూలీలకు డిమాండ్‌ పెరిగింది. రైతుల కోరిక మేరకు ఉపాధిహామీని వ్యవసాయానికి అనుబంధంగా మార్పు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రభుత్వ చర్యలతో గ్రామాల్లో కొత్తవారికి జాబ్‌ కార్డులు రావడంతోపాటు కూలీల కొరత తీరనుంది.

మరిన్ని వార్తలు